Search

Wednesday, May 13, 2015

Panchamukhi Alayam, Panchamukhi, Raichur Dist. Karnataka

ఈ రోజు హుమాన్ జయంతి. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
పంచముఖి ఆంజనేయ స్వామి  ఆలయం, మంత్రాలయం 
   

పంచముఖి అంటే ఐదు ముఖాలు కలవాడు అని అందరికి తెలుసు. భారత దేశంలో కొన్ని చోట్ల మాత్రమె ఈ ఆలయాలు వున్నాయి.   పూర్వనామం  గాణదాల అనే పేరు గల పంచముఖి  గ్రామం కర్నాటక లోని రాయచూరు జిల్లా లో తుంగభద్రా నదికి ఇటువేపు మంత్రాలయం ఆంద్రప్రదేశ్ కి చెందింది. అటువేపు గాణదాల కర్ణాటక రాష్ట్రానికి చెందింది. చుట్టూ కొండలు. అందమైన ప్రకృతి. దగ్గరలో తుంగభద్రా నది. ప్రశాంత మైన వాతావరణం. ఇది పవిత్రమైన ప్రదేశం కూడా!  ఇక్కడ  హనుమంతుడు శ్రీ రాఘవేంద్ర స్వామికి పంచముఖి అవతారంలో దర్శనమి చ్చాడు.  అందుకే ఇది పంచముఖి గా ప్రసిద్ది చెందింది. 


మంత్రలయానికి 21 కి. మీ . దూరం లో పంచముఖి వూరు ఉంది. పంచముఖి ఆంజనేయ స్వామి  ఆలయం ఇక్కడ ఎంతో ప్రసిద్ది చెందింది.   

పంచముఖి  ప్రాశస్త్యం :   పంచముఖి ఆంజనేయుని విగ్రహం ఐదు  ముఖాలు, పది ఆయుధాలతో భక్తులకు దర్సనమిస్తుంది. పంచముఖి ఆంజనేయస్వామిగా కొలిచే ఆ అవతారంలో  హనుమంతుడు, నరసింహుడు, గరుడుడు, వరాహుడు, హయగ్రీవుడు వున్నారు.   హనుమంతుడు మై రావణుని సంహార సమయంలో ఈ పంచ ముఖి అవతారాన్ని ఎత్తాడు. కంభరామాయణంలో  హనుమంతుని గురించి చాల చక్కగా వివరించారు. పంచ భూతాలకి  ప్రతి రూపం కూడా ఈ  ఆంజనేయ స్వామి. గాలి, నీరు, ఆకాశం, భూమి,  నిప్పు వీటిని తనలో ఇముడ్చు కున్నవాడు.
   పవన తనయుడు, ఆకాశ మర్గాన . నీరు సముద్రాన్నిదాటి అవనిజ అయిన సీతాదేవి జాడ తెలుసు కుని  అగ్నితో లంకా దహనం కావించాడు. సుందరా కాండలో కుడా హనుమంతుని ధీర లక్షణాలను ఐదవ ఖండం లో చాలా చక్కగా తెలిపారు. అలాగే పంచ ముఖి ఆంజనేయునిలో తూర్పు దిక్కుని చూసే అంజనేయుడు మనోభీష్టాలు తీర్చే వానిగాను,  దక్షిణ దిక్కు చూసే ఉగ్ర నరసింహుడు అబీష్ట  సిద్ధిని, పడమర దిక్కుని చూసే మహావీరుడైన గరుడుడు సకల సౌభాగ్యాన్ని, ఉత్తర  దిక్కుని చూసే వరాహ స్వామీ  ధన ప్రాప్తిని, ఊర్థ ముఖుడైన హయగ్రీవుడు సర్వ విద్యా ప్రాప్తిని అందిస్తారని ప్రతీతి. 
ఇదు రకాలైన భక్తీ భావాలూ వున్నాయి .  నామం, స్మరణం, కీర్తనం, యాచనం, అర్పణం. హనుమంతుడు శ్రీ రాముని 5 విధములుగా  పూజిస్తాడు. ఎప్పుడు శ్రీ రామ నామం స్మరిస్తూ, కీర్తిస్తూ, రాముని కరుణ, ప్రేమకై తపిస్తూ (యాచిస్తూ ) తనని  తానూ అర్పించుకున్నాడు. 
ఇక్కడి గుహలో పంచముఖి ఆంజనేయ స్వామి రాతిపై వెలిసినట్లుగా  కనిపిస్తాడు. అన్ని చోట్లా కనిపించినట్లు విగ్రహ రూపంలో కనిపించడు.
 శక్తి వంతం, మహిమాన్వితం, అయిన శ్రీ పంచముఖి ఆలయం చూడవలసిన ప్రదేశం. .



 నదిలో ఎవరో  ఈదుతున్నట్లున్న రాయి
 శ్రీ మధ్వాచార్యుల ద్వైత సిద్దాంతాన్ని అనుసరించిన శ్రీ రాఘవేంద్ర రాయరు తుంగభద్రా నదీ తీరాన వున్న మంచాలలో వున్నపుడు తుంగభద్రా నదికి ఆవల వున్న గాణదాళ, బిక్షాలయ అనే గ్రామాలను దర్శించే వారు. గాణదాళలో ఒక కొండ గుహలో శ్రీ రాఘవేంద్ర స్వామి పన్నెండు సంవత్సరములు తపస్సు చేసారు. స్వయంభూగా రాతిపై వెలసిన అంజనేయ స్వామిని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి  కొలిచిన ప్రదేశం ఇది.  కొండ గుహలో రాముని, ఆంజనేయుని పూజించిన అనంతరం గురు రాఘవెంద్రులు శ్రీ వేంకటేశ్వరుడు , శ్రీ మహా లక్ష్మి విగ్రహాలను  చేక్కినట్లుగా చెబుతారు.  ఈ ప్రాంతంలో శ్రీ అనంతాచార్యులు అనే శిష్యులు  రుద్రదేవుడు, గణపతి, నాగ దేవుని విగ్రహాలు ప్రతిష్టించారు.  
శిష్యులు శ్రీ అనంతాచార్యులు 
ఈ గుహలో అదృశ్యమైన అనంతాచార్యులు 
కూర్మం (తాబేలు ఆకారం)లో శిలలు 
పెద్ద రాయిని మోస్తున్న చిన్న రాయి 
శ్రీ గురు రాఘవేంద్ర స్వామికి  పంచముఖి  ఆంజనేయ స్వామి, కొల్హాపుర మహాలక్ష్మి, తిరుపతి వెంకటేశ్వర స్వామి, కూర్మావతారంలో విష్ణుమూర్తి  ప్రత్యక్ష మయినట్లు గా ఇక్కడి చరిత్ర చెబుతోంది. శ్రీ రాఘవేంద్రస్వామి అనంతరం మంత్రాలయం వెళ్లి అక్కడ సజీవ సమాధి అయ్యారు. 
               ఇక్కడ సహజం గా రాళ్ళతో  ఏర్పడిన  ఆకృతులు నిజంగా ఆశ్చర్య పరుస్తాయి. మంచం తలగడ, విమానం, తాబేలు, పాదుకలు, ఇంకా ఎన్నో ఆకారాలు మనకి దర్సనమిస్తాయి.  పంచముఖి ఆలయంలో ప్రతి రోజు పూజాదికాలు నిర్వహిస్తుంటారు. 
ఇక్కడికి చేరుకోవాలంటే మంత్రాలయం నుంచి ఆటోలు, టాక్సీలు వెడుతుంటాయి. రోడ్డు మార్గం సరిగా లేదు. బస్సు సర్వీసులు లెవు. ఇదివరకు మేము 1975లో మంత్రాలయం లోని  తుంగభద్రా  నది దాటి 5 కి.మి దూరం లో వున్న పంచముఖి ఆలయం చేరుకున్నాం. ఇప్పుడు నదిలో నీళ్ళు లెవు. పడవలు లెవు.ఇప్పటి కట్టడాలు, మెట్లు లెవు. కొండ పై మనుష్యులు, పూజారులు లెరు... 
ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది అలయం.  కొత్తగా నదిపై బ్రిడ్జి నిర్మించారు. రవాణా సౌకర్యం మెరుగుపడింది. 


Saturday, November 8, 2014

ప్రముఖ రచయిత్రి దివ్వేదుల విశాలాక్షి



 ఆంధ్రుల అభిమాన రచయిత్రి శ్రీమతి దివ్వేదుల విశాలాక్షి గారు (85) శుక్రవారం సాయంత్రం విశాఖ లోని తమ స్వంత ఇంటిలో కన్నుమూశారు. ఆమె మరణంతో సాహితీప్రియులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. వారి రచనల్లో . ‘వైకుంఠపాళి’ 'గ్రహణం విడిచింది' తో పాటు అనేక నవలలు ఎంతో ప్రసిద్ధి పొందాయి. ఇప్పటికీ ఆ నవలల పాత్రలు సజీవంగా నిలిచి వున్నాయి. వీరి రచనల ద్వారా విచ్చిన్నమవుతున్న మానవ సంబంధాలను తిరిగి తన రచనల ద్వారా నిలబెట్టే ప్రయత్నం చేసారు ఈ రచయిత్రి. 
వీరి రచనల్లోని స్త్రీ పాత్రలు ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేస్తాయి. 
 మహిళా ఉద్యోగినులు, చదువుకునే అమ్మాయిలు తమ సమస్యలు ఎలా ఎదుర్కొనేవారో తెలియ చెబుతాయి. అలాగే ఆధునిక మధ్య తరగతి మహిళల విలువలు తెలియ చేసేవారు.
చాలా మందికి పుస్తకాలే నాటి రోజుల్లో ప్రధాన నేస్తాలు, కాలక్షేపాలు . 70వ దశకంలో వెలువడే ప్రముఖ పుస్తకాలలో విశాలాక్షి గారి రచనలుండేవి. చాలా మందికి వీరు అభిమాన రచయిత్రి. 1929 ఆగస్టు 15న విజయనగరంలో జన్మించిన ఆమె విద్యాభ్యాసం అక్కడే కొనసాగింది.
తెలుగుతోపాటు ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో పరిజ్ఞానం కలిగిన విశాలాక్షి.. అనేక కథలు, కవితలు, వ్యాసాలు, రేడియో నాటికలు రచించారు. అమెరికా, కెనడా, ఇంగ్లండ్‌, మలేషియా, సింగపూర్‌ దేశాల్లో పర్యటించి తన సాహిత్య వాణి వినిపించారు. 1965లో.. ‘వైకుంఠపాళి’ నవలా రచనతో ప్రారంభమైన విశాలాక్షి సాహిత్య ప్రస్థానం 1995లో రాసిన ‘ఎంత దూరమీ పయనం’ వరకూ కొనసాగింది. ఆమె మొత్తం 13 నవలలు రాశారు. విశాలాక్షి రచించిన ‘వారధి’ నవలను.. ‘రెండు కుటుంబాల కథ’ పేరుతో 1969లో ఫీచర్‌ ఫిల్మ్‌గా నిర్మించగా, ‘వస్తాడే మా బావ’ సినిమాకు ఆమె మాటలు రాశారు. ఆమె కథలు ఎనిమిది సంపుటాలుగా వెలువడ్డాయి. విశాలాక్షి రచించిన కొన్ని నవలలను కన్నడ, హిందీ భాషలలోకి అనువదించారు.
సుమన కలం పేరుతొ ఆమె రాసిన పుస్తక సమీక్షలు ఎంతో పేరు పొందాయి. రేడియో నాటికలు కూడా ఎంతో ప్రాచుర్యం పొందాయి.
విశాలాక్షి గారు అమెరికా,కెనడా, మలేసియా,సింగపూర్ లల్లో పర్యటించారు.
ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు (1982),రసమయి సంస్థ (1995) సన్మానం , జేష్ఠ లిటరసీ పురస్కారం (1996) రాజాలక్ష్మీ ఫౌండేషన్‌ లిటరరీ అవార్డు (1999) సహా 13 పురస్కారాలను విశాలాక్షి అందుకున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆమెకు 1998లో గౌరవ డీలిట్‌ ప్రదానం చేసింది. నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌(ఢిల్లీ) వారు. రావి శాస్త్రి స్మారక సాహిత్య ట్రస్ట్ వారి సన్మానాన్ని (2000) అందుకున్నారు ఆమె ‘వారధి’ నవలను 1973లో పలు భారతీయ భాషలలోకి అనువదించి ప్రచురించారు. ఆంధ్ర, వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో పలువురు విద్యార్థులు ఆమె రచనలపై పరిశోధనలు జరిపి ఎంఫిల్‌, పీహెచ్‌డీలు పొందారు.
దివ్వేదుల విశాలాక్షి గారి స్మృతి గుర్తుగా ఈ వ్యాసం.

Wednesday, October 15, 2014

Smt Turaga Janaki Rani - no more

తెలుగు వారి అభిమాన రచయిత్రి , రేడియో అక్కయ్య శ్రీమతి తురగా జానకి రాణి గారు పరమ పదిం చారని తెలిసి ఈ పోస్ట్ చేయకుండా వుండలేక పోతున్నాను. వారిని ఒక వెబ్ సైట్ కోసం ఇంటర్వ్యూ తీసుకున్న సందర్భం ఇది. నా జ్ఞాపకాలలో వారి కి నేనిచ్చే అక్షర నివాళి 

రేడియో అక్కయ్య: "తురగా జనకీరాణి"గారితో తో ముఖా ముఖి

పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించి, చిన్నారులతో ప్రదర్శింపచేశి ఆలిండియా రేడియోలో నేటికీ రేడియో అక్కయ్యగా అందరి మదిలో మెదిలే వ్యక్తి తురగా జానకీ రాణిగారు. మంచి రచయిత్రి, సంఘ సంస్కర్త కూడా
Turaga Janaki Rani
మానవుని వినోద సాధనాలు ఎన్ని వచ్చినా నేటికీ వన్నె తరగని సాధనం రేడియో! ఏ పని చేస్తున్నా చెవులు రిక్కించి వినేది ఆకాశవాణి కార్యక్రమాలే! ఆలిండియా రేడియోలో నేటికీ రేడియో అక్కయ్యగా అందరి మదిలో మెదిలే వ్యక్తి తురగా జానకీ రాణిగారు. ఎందరో చిన్నారులు బాలానందంలో తమ కంఠం వినిపించడం వెనుక ఆమె ఉన్నారు. పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను ఆవిడ రూపొందించి వాటిలో చిన్నారులతో ప్రదర్శింపచేశారు. ఎందరో బాలబాలికలకి పబ్లిక్ స్పీకింగ్ భయంపోయి మైక్ లో ధైర్యంగా మాట్లాడటానికి.. వారిలోని సృజనాత్మకతకు ..ఇలా ఎన్నో విషయాలకిబాలానందం ఒక వేదిక అయింది. డాక్టర్లు, లాయర్లు, సినీ తారలు , ఎన్.ఆర్.ఐలు... ఒకరేమిటి ఎందరో ప్రముఖులు తామకు చిన్నతనంలో ఆకాశవాణిలో రేడియో అక్కయ్యతో వున్న అనుభవం మర్చిపోలేరు. నేటికీ ఆమెను ఒక ఆత్మీయురాలిలాగా పలకరిస్తుంటారు...
రేడియో ఆర్టిస్ట్ గానాటకాలలోనూ, ఇతర కార్యక్రమాలలోనూ విశేష అనుభవం వున్నతురగా జానకీ రాణి గారు1975 లో ఆకాశవాణిలో ఉద్యోగంలో చేరారు. 1994లో ఐ.బి.పి.ఎస్. అసిస్టెంట్ డైరెక్టర్ గా పదవీ విరమణ చేశారు.
వారితో వారి రేడియో అనుభవాల గురించి కాసేపు...
* ఆకాశవాణిలో మీ ఉద్యోగ బాధ్యతలు ఎలా వుండేవి?
ఛాలెంజింగ్ గా వుండేది. సమయపాలన పాటించడంతో పాటు శ్రోతలకీ న్యాయం చేకూర్చాలి. 1975లో ఉద్యోగంలో చేరినప్పుడు మనదేశంలో ఎమర్జెన్సీ అమలులో ఉండేది. ఆకాశవాణి ద్వారా ప్రభుత్వ పాలసీలు, విధానాలు ప్రజలకి చేరవేయాలి.ఒక ఛాలెంజింగ్ గా వుండేది....నేను ఏ కార్యక్రమం చేసినా ఆమోదించేవారు. స్వేచ్ఛ వుండేది. కార్యక్రమాల్లో వైవిధ్యం రూపొందిచడానికి ప్రయత్నించేదాన్ని.
బాలానందంద్వారా పిల్లల వినోదం, విజ్ఞానం కోసం నాటికలు, రూపకాలు,సంగీత, సాహిత్యకర్యక్రమాలు, ఇలా ఎన్నో కార్యక్రమాలు రూపొందించేవాళ్లం. కొన్ని పెద్దల ద్వారా చెప్పిన విషయాలు బాగుంటాయి. బాలానందం ద్వారా ఎన్నో ప్రయోగాలు చేశాను.
* స్త్రీల కార్యక్రమాలు రంగవల్లి..... వంటి కార్యక్రమాల గురించి...?
మహిళలకోసం కూడా కొత్త ప్రయోగాలు చేసాము. ముఫై సంవత్సరాల కిందటే "ఇది నా సమస్య" అని స్త్రీల కార్యక్రమం ప్రసారం చేసేవాళ్ళం. స్త్రీలు తమ సమస్యలు ఉత్తరాల ద్వారా తెలియ పరిస్తే వాటి పరిష్కారాలు నిపుణులైన డాక్టర్లు, లాయర్లు మొదలైన వారిచే చెప్పించే వాళ్ళం. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వుండేది. వందల సంఖ్యల్లో వుత్తరాలు వచ్చేవి. వృద్ధుల కోసం తమ జీవితానుభవాలు తెలిపే "స్రవంతి" అనే కార్యక్రమం మొదలు పెట్టాము. అది ఇప్పటికీ కొనసాగుతోంది. అందరికీ చదువు అని పంచాయితీలలోని స్త్రీలకి పాఠాలు అందించేవాళ్ళం... మహిళలు వారు రాసిన కవితలు, కధలు, పాటలు ఈ కార్యక్రమంద్వారా వినిపించేవాళ్ళు....
* ఆకాశవాణిలో ఒక కార్యక్రమంరూపుదిద్దుకోవడానికి ప్రోగ్రామర్ బాధ్యత ఏవిధంగా వుంటుంది?
ఒక కార్యక్రమం రూపొందించాలంటే ముఖ్యంగా మూడు విషయాలు గమనించాలి.
1. ప్లానింగ్, 2.ప్రోడక్షన్ 3. ప్రెజెంటేషన్. ప్లానింగ్ పర్ ఫెక్ట్ గా వుండాలి. తరువాత ప్రొడక్షన్ లో విలువలుండాలి. ప్రెజెంటేషన్ లో ముఖ్యంగా. అది అందర్నీ ఆకట్టుకునేలా వుండాలి. ఈ మూడు కలిపి తేనే ఏ కార్యక్రమమైనా చక్కగా వుంటుంది. నేను ఎక్కువగా సంగీతాన్ని ఉపయోగించేదాన్ని.
* ఆకాశవాణి గురించి ఇతర విషయాలు గురించి అడిగిగినపుడు  
రేడియో కార్యక్రమానికి మానవ కంఠ ధ్వని, ఇతర శబ్దాలు, విరామం ఎంతో ముఖ్యం. అలాగే రేడియోలో పాల్గొనే వారు ఎక్సపర్ట్స్ కానవసరం లేదు. ఎక్స్‌పీరియన్స్ ముఖ్యం. చెప్పదలచిన విషయాన్ని ఇచ్చిన సమయానికి సమయపాలన పాటించి చెప్పగలగాలి. వృద్ధులు చెప్పే దాంట్లోనూ విలువలుంటాయి.
రేడియో అనేది స్టూడియో నాలుగు గోడల మధ్య ఉండేది కాదు. ప్రజల మధ్యకి వెళ్ళి వారి అనుభవాలు, వాళ్ళ నాలెడ్డ్ తెలుసుకోవాలి అని చాలా క్రార్యక్రమాలు ప్రజల వద్దకి వెళ్లి చేసేవాళ్ళం. సాధారణ ప్రజలని కూడా ఇందులో భాగస్వామ్యులని చేయటం ద్వారా వారి అనుభవాలు నలుగురికీ తెలిసేవి. ఇందులో భాగంగా మేము గోదావరిఖని, జడ్చర్ల, కరీంనగర్, శ్రీశైలం....ఇలా ఎన్నో ప్రదేశాలు తిరిగి కార్యక్రమాలు రూపొందించేవాళ్ళం.

 * ఇతరులతో కలిసిపని చేసిన అనుభవాల గురించి....?

ఉద్యోగ నిర్వహణలో భాగంగా ఎందరో పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి పని చేశాను. దేవుల పల్లి కృష్ణ శాస్త్రిగారు, స్ధానం నరసింహారావుగారు, వేలూరి శివానంద్ , గోపీచంద్.... ఇలా ఎందరో వున్నారు. వివిధ రంగాలలో ప్రసిద్ధులైన వారు, సినీ రంగ ప్రముఖలు అక్కినేని నాగేశ్వరరావు, యస్.పి. బాలసుబ్రమణ్యం, జె.వి. సోమయాజులు, మంజు భార్గవి, ఇంకా ఎందరో నటీ నటులతో కలిసి కార్యక్రమాలు రూపొందించాను.
* రేడియో అక్కయ్యగానే కాక మీరు మంచి రచియిత్రి గా కూడా అందరికీ సుపరిచితులు. మీ రచనల గురించి చెప్పండి?
వందకి పైగా కధలు రచించాను. అవి మూడు సంపుటాలుగా వెలువడ్డాయి. మూడు నవలలు, ఐదు బాలసాహిత్యం మీద పుస్తకాలు వచ్చాయి అనువాద రచనలు కూడా మూడు వచ్చాయి. అగమ్య గమ్య స్ధానం అనే కధకి రాచ కొండ విశ్వనాధ శాస్త్రిగారు అభినందిస్తూ ఉత్తరం రాశారు. ఆ కధ ఇంగ్లీషులోకి తర్జుమా అయింది కూడా... ఇప్పటికీ రచనలు కొనసాగుతున్నాయి. ఇటీవలే డా. దుర్గాబాయి దేశ్ ముఖ్ గురించి రూపకం ఆకాశవాణికి రాసిచ్చాను. 
* జానకీ రాణి గారూ! మీరు మంచి రచయిత్రే కాదు మంచి సంఘ సంస్కర్త కూడా.... ఆ అనుభవాలు కూడా మాతో పంచుకోండి....
యూనిసెఫ్ లో నూ, ఎన్.సి.ఆర్.టి., ప్రభుత్వ శాఖల కోసం ... పని చేసేటప్పుడు బాల జాగృతి (బా జా)అనే కార్యక్రమం చేపట్టి 670 street shows (వీధి ప్రదర్శనలు) చేశాము. బాలల హక్కులు, సమస్యలు, బాల కార్మిక నిర్మూలన, ఇత్యాది ఎన్నో విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించేవాళ్లం. సామాజిక స్పృహ వున్న విషయాలు, సృజనాత్మక సందేశాలు పిల్లలు, యువతీ యువకులు శిక్షణ పొంది ప్రదర్శించేవాళ్లు.
"మా చేతి పంపు-మా బిందె నింపు" అనే సోషల్ ఎవేర్ నెస్ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది.
*ప్రస్తుతం వస్తున్న వివిధ రేడియో ఎఫ్.ఎం. స్టేషన్ల గురించి మీ అభిప్రాయం?
కొత్త ట్రెండ్స్ ని ఆపలేం... రేడియో ప్రయోజనం మారింది. అందరికీ టి.వి. చూసే సమయం వుండటం లేదు. ఉద్యోగాల రీత్యా... ఉరుకులు పరుకుల జీవిత విధానంలో రిలాక్స్ గా ఇప్పుడు అందరూ రేడియో వినడానికే ఇష్ట పడుతున్నారు. కారులో ప్రయాణిస్తూ కూడా రేడియోనే వింటున్నారు.
రేడియో అంటేనే "బహుజన హితాయ... బహుజన సుఖాయ... !" రేడియో ద్వారా హితం పలుకుతాం... అందరికి సుఖాన్ని అందిస్తాం. సంఘంలోని సంస్కృతిని నిలపటానికి ఉంది. సమాజం లో జరిగే మార్పులు ప్రజలకు తెలిపేలా ఉపయోగ పడే సాధనం రేడియో. .. అంటారు తురగా జానకీ రాణిగారు.
* ----ఈ ఇంటర్వ్యు  తీసుకుని దాదాపు  7 సంవత్సరాల అవుతోంది. అనంతరం కూడా వారు ఎన్నో అవార్డులు, సత్కారాలు అందుకోవటం. స్వీయ రచనల పుస్తకాలు ప్రచురించటం, ఇంకా ఎన్నో సంఘటనలు కాల వాహినిలో జరిగాయి. ఇది   బాలానందం పిల్లలు అభిమానించే రేడియో అక్కయ్య గా  వారితో జరిపిన ముఖా ముఖి..... 

Monday, September 8, 2014






అందమైన బాపు బొమ్మ సృష్టికర్త బాపు తానే  ఒక బొమ్మై పోయారు 


బుడుగు సృష్టి కర్త బాపు ఇక లేరు!!
ఆప్తమిత్రుడు అయిన ముళ్ళపూడి వెంకట రమణ తో కలిసి చిత్ర దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలు నిర్మించిన బాపు కుంచె నుంచి ఎన్నో చిత్రాలు ప్రాణం పోసుకున్నాయి. ప్రతి బొమ్మ మనకి   బొమ్మల్లాగా వుండవు కదిలే బొమ్మలుగా జీవం పోసుకుని  మనతో మాట్లాడుతున్నట్లుగానే వుంటాయి. బాపు బొమ్మల ముఖ కవళికలు కళ్ళు, నోరు ముఖం అన్నీ కుడా జీవం వుట్టి పడు తుం టాయి. కార్టూన్స్ ఎంతో హాస్యాన్నిస్తాయి. బాపు కార్టూన్ల పుస్తకాలు చాలా మంది బహుమతులుగా కుడా ఇస్తుంటారు.  
తెలుగు వారందరి అభిమాన చిత్రకారుడు, కార్టూనిస్ట్ చిత్ర దర్శకుడు ఇంకా ఇంకా చాలా చాలా కళలున్న ప్రముఖ వ్యక్తి శ్రీ బాపు గారు.   గత కొన్ని నెలలుగా అస్వస్తతతో వున్న వారు   31 8 2014 న మద్రాసులో తుది శ్వాస విడిచారు.  
అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు బాపు బొమ్మలా వుంది అంటారు. అలాగే పక్కింటి లావుపాటి పిన్నిగారు కారెక్టర్ మనకి ఎంతో పరిచయమైనట్లే వుంటుంది. ఇక చిన్న పిల్లలకి  వీరి కార్టూన్స్ అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా బుడుగు బొమ్మలు. సి గాన పెసూనాంబ బుడుగు లతో వచ్చే కార్టూన్స్ పిల్లలే కాదు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా చదువు తుంటారు  బుడుగు పుస్తకం (2-భాగాలు) ఇప్పటికి ఎన్నో ముద్రణలు వచ్చాయి.   అందరూ అభిమానించే కార్టూన్ కారెక్టర్ బుడుగు.   బాపు గారి కార్టూన్స్ గాని ఇలస్త్రేషన్స్ కాని పేయింటింగ్స్ కాని ఆహ్లాదకరంగా వుంటాయి. గజి బిజీ రంగులు , గాడీ గా వుండే బ్యాక్ గ్రౌండ్స్ వుండవు. సింపుల్ రేఖలతో చిన్న గీతలతో అందంగా బొమ్మలు గీస్తారు. బాపు 
పురాణాల పాత్రల చిత్రణలో నాయకుడు ఇతను అని, ఇతను ప్రతి నాయకుడు అని  ప్రత్యేకంగా గీస్తారు. వాటిని చూసి ఆయా పాత్రల క్యారెక్టర్ ఈజీగా గుర్తుపట్టచ్చు వీరు గీసిన నవరసాల పెయింటింగ్స్ మనకి ప్రతి కళా సంస్థల్లో దర్సనమిస్తాయి. 
1933 డిసెంబర్ 15న నర్సాపూర్ లో జన్మించిన బాపు అసలు పేరు సత్తిరాజు లక్ష్మి నారాయణ.   వీరి శ్రీమతి   కాలం చేసారు. వీరికి ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె వున్నారు.తొలుత పొలిటికల్ కార్టూనిస్ట్ గా అంధ్ర పత్రికలో చేరారు 1942లోనే  రమణగారి  కథలకి బొమ్మలు  వేయటం తో మొదలైన వీరి చిన్ననాటి  స్నేహబంధంతో ఇద్దరు ఎన్నో కథలు కార్టూన్స్ సృష్టించారు.   1967లో వీరు   చిత్ర దర్శకుడిగా నిర్మించిన   సాక్షి సినిమా తెలుగు చిత్ర సీమలోఎంతో ఘన విజయం సాధించింది. ఆ చిత్రం 1968 లో తాష్కంట్ లో ప్రదర్సించబడింది 
     బాపు రమణల కాంబినేషన్ లో దాదాపుగా 51 చిత్రాలు వచ్చాయి. వీరి ప్రతి చిత్రం ఎంతో ఘన విజయం సాధించింది. సంపూర్ణ రామాయణం చాలా కాలం థియేటర్స్ లో ఆడింది. చివరి చిత్రం శ్రీ రామరాజ్యం. (2011 . బాపు హింది  చిత్రాలకు కుడా దర్సకత్వం వహించారు లండన్ లోనూ బాపు దర్సకత్వం వహించిన చిత్రాలు ప్రదర్శించారు. 

బాపు  ఎన్నో అవార్డులు సత్కారాలు అందు కున్నారు. 
చలన చిత్ర రంగంలో బాపు చేసిన కృషి ని గుర్తించి భారత దేశ  ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డుని 1913లో అందించింది. 
ఇంకా   నేషనల్ అవార్డ్స్, లైఫ్ టైం అచివ్మెంట్  అవార్డు,  నంది అవార్డ్స్,  ఫిలిం ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. బాపు దర్సకత్వం వహించిన ఎన్నో చిత్రాలు నంది అవార్డు లని అందుకున్నాయి. అంతర్జాతీయ  ఖ్యాతిని పొందిన బాపు   విదేశాలలో సైతం ఎన్నో అవార్డ్ లు సత్కారాలు, సన్మానాలు అందు కున్నారు. 

వీరి చిత్రాల్లో సాక్షి, సంపూర్ణ రామాయణం ముత్యాల ముగ్గు, సీతా కల్యాణం, రామ రాజ్యం ఇంకా ఎన్నో చిత్రాలు చిత్ర రాజాలుగా నిలిచాయి. ఇప్పటికి సాక్షి చిత్రం లో డైలాగులు, పాటలు ముత్యాల చిత్రం డైలాగులు పాటలు చిత్రాల స్టిల్స్ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాయి. బాపు ఆర్ట్ ఎగ్జిబిషన్  దేశంలో చాలా చోట్ల జరిగాయి 


  
బాపు లేనిదే రమణ లే రు  , రమణ లేనిదే బాపు లేరు  . అందరికి బాపు- రమణ గానే తెలుసు. కాని రమణ గారు తొందరాగా ఈ లోకం విడిచి వెళ్ళారు. ఇప్పుడు బాపుగారు కుడా పైలోకం లో రమణ గారిని కలుసు కోవటానికి వెళ్ళారు. అరవై దశాబ్దాల స్నేహం నిన్నటి నుంచీ పై లోకం లో కుడా   కొనసాగుతోంది. 
బాపుగారి  బొమ్మలు ఎన్నో పుస్తకాల కవర్ పేజిలలో చోటు చేసుకున్నాయి. దిన వార మాస పత్రికలే కాదు రచయిత(త్రు)లు ల నవలలకి బొమ్మలు గీసారు.  బాపుగారి చిత్రాలు లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. బాపు స్వాగత చిత్రం ప్రతి ఇంతా అలరిస్తుంటుంది. 
బాపుగారి బొమ్మలతో పాటు వారి కార్టూన్ లకి రాసే లిపి ప్రత్యెకమైంది. ఈ   కర్సివ్ రైటింగ్ అందంగా వుంటుంది. (కంప్యుటర్ లలో సైతం బాపు లిపి తో ఒక లిపి కుడా అను ఫాంట్స్ వారు క్రియేట్ చేసారు) 
చిన్న నుంచి పెద్ద దాకా ఇష్ట పడే బాపు బొమ్మ సృష్టి కర్త   బాపు  ఇక లేరు అనే వార్త సిని రంగంతో పాటు అభిమానులని  అందరిని దుఃఖ సంద్రంలో ముంచేసింది. వారి గురించి ఈ నాలుగు వాక్యాలు రాయటం  వారికి నేను ఇచ్చే అక్షర నివాళి. 
Mani Kopalle's photo.
బుడుగే కాదు ఇంకా ఎంతో మంచి అందమైన కార్టూన్ బొమ్మలు రెండు జళ్ళ  సీత 
కూడా ఫేమస్సె. వారి దర్సకత్వంలో ఎన్నో చిత్ర రాజాలు ఎప్పటికి మరువలేనివి. వారిపై మా టివి లో వచ్చిన కార్యక్రమం మీరు షేర్ చేసుకొని మరొక్కసారి వారిని చూడండి




https://www.youtube.com/watch?v=AWf-SrADnms&list=TL2Wo5s8lGiJkTk7-VcggvSeDMGQnd7FiE

Thursday, May 1, 2014

దేశోద్దారక కాశీ నాధుని నాగేశ్వర్రావు పంతులు గారు 


ఈరోజు ప్రముఖ పాత్రికేయుడు, స్వాత్రంత్ర్య సమరయోధుడు, రాజకీయనాయకుడు అయిన కాశీనాధుని నాగేశ్వర రావు పంతులుగారు పుట్టినరోజు. 1867 వ సంవత్సరంలో మే 1న జన్మించారు. కృష్ణాజిల్లా ఎలకుర్రు గ్రామంలో వీరి జన్మ స్థలం. తల్లి శ్యామలాంబ, తండ్రి బుచ్చయ్య. మచిలీపట్నంలో వీరి విద్యాభ్యాసం. మద్రాస్ క్రిష్టియన్ కాలేజీలో చదివారు. 'దేశోద్ధారక' అని ఆయనను అంతా గౌరవించేవారు. కందుకూరి వీరేశలింగం గారి వ్యాసాలు వీరిని ఎక్కువ ప్రభావితం చేసేవి. 
***


“పోయిందే… It’s gone” 
ఈ వాక్యాలు గుర్తున్నాయా?
ప్రముఖ తలనొప్పి బామ్ కాప్ష్ న్ ఇది. తలనొప్పి, కాళ్ళనొప్పి, చేయ్యినోప్పి, మెడనొప్పి ఇలా శరీరంలో ఏ రుగ్మతలోచ్చినా వాడే బామ్ అమృతాంజనం. పసుపురంగులో చాలా ఘాటుగా కళ్ళవెంట నీళ్ళు తెప్పించినా ప్రతి ఒక్కరు ఆ రోజుల్లో వాడే బామ్ అమృతాంజనం. దీన్ని కనిపెట్టి అందరికీ అందుబాటులోకి తెచ్చిన వారు కాశీనాధుని నాగేశ్వర రావు గారు. నేటికీ ఎంతో మంది దీన్నే వాడుతున్నారు. 
మద్రాసు, కలకత్తా, ముంబాయి నగరాల్లో వ్యాపారాలు చేసారు. ముంబై లో విలియం అండ్ కంపెనీ అనే విదేశీ సంస్థలో కొంత కాలం పని చేసారు. ఆ సంస్థ యజమాని తమ దేశం వెడ్తూ ఆ కంపెనీని శ్రీ కాశీ నాదుగారికి అప్పగించారు. దాంతో ముంబై లో 1893 లో అత్యంత ప్రాచుర్యం పొందిన అమృతాంజనం లిమిటెడ్ ని స్తాపించారు. 
1907 లో అఖిల భారతీయ కాంగ్రెస్ మహాసభలు సూరత్ లో జరిగినపుడు పాల్గొన్న ఆయనకి తెలుగులో కూడా వార్తా సమాచారాలను అందించాలి అని అనుకున్నారు. 1908 సెప్టెంబర్ లో అయన ముంబాయి నుంచి ఆంధ్ర పత్రికను ప్రారంభించారు ఆ రోజుల్లో దేశీయ పత్రికలపై ఆంగ్ల ప్రభుత్వం ఆంక్షలు విధించేది. అయినా ఆయన ఎంతో ధైర్యంతో అంకిత భావంతో ఆ పత్రికని నడిపించారు. వారపత్రిక, దినపత్రిక వెలువడేవి. యుద్ధ పరిస్తితులు, మారుతున్న పరిణామాలు,తెలుగువారికి అందించేవారు. వారు ఎందరో రచయితలని ప్రోత్సహించే వారు. 

ఈ పత్రిక ముంబై నుంచి 1914లో మద్రాసు నుంచి వెలువడేది. ఇదే తొలి తెలుగు పత్రిక. 1924 లో భారతి అనే సాంస్కృతిక, సాహితీ పత్రిక ప్రారంభించారు. అలాగే అంద్రోద్యమ కాలంలో కూడా స్వరాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ప్రచారంలో పత్రిక విశేషమైన కృషి చేసింది. అంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు లోనూ ఆ పత్రిక ఎంతో కృషి చేసింది. 
మద్రాస్ లో జరిగిన అంధ్ర మహాసభలో తెలుగు భాష, సంస్కృతిలకు అయన చేసిన సేవలను గౌరవిస్తూ ఆయనను ‘దేశోద్ధారక’ అని బిరుదునిచ్చి సత్కరించారు. నాగేశ్వర రావు పంతులు గారు ‘అంధ్ర గ్రంధమాల’ అనే ప్రచురణ సంస్థని ప్రారంభించి అనేక పుస్తకాలను ముద్రించారు. 
గ్రంధాలయోద్యమానికి నాగేశ్వరరావు గారిని పితామహునిగా అభివర్ణించచ్చు . 
అటు పత్రికారంగంలోను వ్యాపార రంగోలోనూ వుంటూనే రాజకీయ ప్రవేశం చేసారు. నాలుగుసార్లు ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగా వున్నారు. ఖద్దరు ఉద్యమాని కి తన మద్దతుని అందించారు. ఉప్పుసత్యాగ్రహం లో పాల్గొన్నారు. ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. 
వీరి ఇల్లు ఎప్పుడూ బంధు మిత్రులతో, అతిధులతో కళ కళలాడుతూ వుండేది. ఉట్టి చేతులతో ఎవరినీ పంపేవారు కాదు దానశీలి అందుకే మహాత్మా గాంధీ ఆయనను విశ్వదాత అని కోడియాడారు. 
అంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. 
రాజకీయ రంగంలో …
నాగేశ్వర రావు పంతులు గారు నాలుగుసార్లు ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షులుగా వున్నారు. 
1935 లో రాష్ట్ర శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. ఉప్పు సత్యా గ్రహ సమరం లో ఏడాది పాటు జైలు శిక్షను కూడా అనుభవించారు. 
ముఖ్యంగా అంధ్రపత్రిక చాలా కాలం వరకు నిర్విఘ్నంగా నడిచింది. వీరి తదనంతరం వీరి అల్లుడు శివలెంక శంభు ప్రసాద్ ఈ పత్రికని మరింతగా అభివృద్ధి చేసారు. దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు గారు 1938 ఏప్రిల్ 11న మరణించారు. 
పత్రికా రంగంలో వీరు చేసిన విశేషమైన కృషి, ఒక సంపాదకుడుగా ఎందరికో మార్గదర్శి. వారు రాసిన సంపాదకీయాలు, వ్యాసాలు, విశ్లేషణలు ఇంకా ఎన్నో సాహితీ ప్రక్రియల్లో వారు చేసిన చేసిన కృషి నేటి సంపాదకులకి, విలేఖరులకి మార్గదర్శకుడు. అందుకే ఈరోజున కనీసం వారిని తలుచుకోవటం మన కర్తవ్యం. 
శ్రీ కాశీ నాధుని నాగేశ్వర రావు గారు స్వదస్తూరి టో రాసిన లేఖ. 
            
1969 లో వారి పేరు మీద విడుదలైన పోస్టల్ కవర్. 

 Mani Kopalle's photo.

Saturday, April 26, 2014

Baiju Bawara [1952] | Meena Kumari | Bharat Bhushan | Music By Naushad |...


స్వర్గీయ మీనాకుమారి హిట్ సినిమాలలో బైజు బావర ఒకటి. అలనాటి ఆ సంగీత మయమైన పాటలు వింటూ ఈ పోస్ట్ చేస్తున్నా.









Thursday, April 17, 2014

ఆవకాయ ముచ్చట్లు


ఆవకాయ ముచ్చట్లు 


వచ్చేసింది ఎండాకాలం! దానితో పాటే ఆంధ్రుల ఆవకాయ, మాగాయలు పెట్టుకునే రోజులు వచ్చేసాయి. ఈ ఏప్రిల్, మే నెలల్లో ఎ ఇంట చూసినా ఆవకాయ ముచ్చట్లే! ఎన్ని రకాలు పెట్టచ్చు ఎంత పెట్టచ్చు ఇంకా ఇంకా చాలా చాలా కబుర్లే వుంటాయి. ఆ వూసులు  నేను చెప్పేకంటే ….  ప్రముఖ హాస్య కధా రచయిత్రి, అన్నిటికి మించి మా స్నేహితురాలు, ఆత్మీయురాలు శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు మనందరితో ఒక పత్రికా ముఖంగా మనందరితో మాట్లాడిన ముచ్చట్లు ఒకసారి గుర్తు చేస్తే సరిపోతుంది అనిపించింది. ఇదిగో ఇవే అవి .......

ఆవకాయను కాపాడుకోవడం ఎలా?

మే నెల అంతా  ఎక్కడ.. ఏ ఇద్దరు ఆడవాళ్ళు కలుసుకున్నా, ఫోన్‌లో మాట్లాడుకున్నా ఒకటే టాపిక్- ఊరగాయల పనులు అయ్యాయా? ఇక ఆ విషయం గురించి బోలెడంత చర్చ.
మామిడికాయలు ఎక్కడ కొన్నారు? గడ్డి అన్నారంలోనా? గుడి మల్కాపూర్‌లోనా? మోండా మార్కెట్‌లోనా? నల్లకుంటలోనా? ఆవకాయకి చిన్న రసాలు కొన్నారా? గులాబీ రకమా?
కారం, ఆవపిండీ కొంటారా? మిషను ఆడిస్తారా? పప్పు నూనేగా? ఏవేం పచ్చళ్ళు పెట్టారు?-అని ఆరాలు.
ఆవకాయ సరే- అందరూ పెడతారు.. పెసరావకాయ, మాగాయ, మెంతికాయ, తొక్కుడు పచ్చడి.. ఇలా ఎవరెన్ని రకాలు పెడితే అంత గొప్పగా, గర్వంగా చెప్పుకుంటారు. ఒక్కోసారి వాదోపవాదాలు కూడా వస్తాయి.
మా వైపు ఆవకాయ రుచే వేరు. శనగలు వేస్తాం ఆవకాయలో అని గుంటూరు జిల్లా వదినగారు అంటే, చాల్లెండి గోంగూర, కొరివి కారం మాత్రమే మీవి. ఆవకాయలు మా గోదావరి జిల్లా వారి సొత్తు. మేము పెట్టినన్ని వెరైటీలు ఎవరూ పెట్టరు. నువ్వుపిండి ఆవకాయ, పచ్చావకాయ, నీల్లావకాయ, ఎండావకాయ అంటుంది మరో అక్కగారు. ఎవరెన్ని రకాలు పెట్టినా మా బెల్లం ఆవకాయ తరువాతనే అంటుంది శ్రీకాకుళం పిన్నిగారు.
భార్యామణి కొత్తావకాయ ఎప్పుడు రుచి చూపిస్తుందా? అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ వుంటారు మగవాళ్ళు. అదేవిటో.. ఆవకాయకి, పురుషపుంగవులకీ అవినాభావ సంబంధం.
ఈ సీజన్లో ఎవరింటికి భోజనానికి వెళ్లినా కంచం ముందు కూచోగానే కొత్తావకాయ కలిపేసారా? అనే అడుగుతారు. ఇప్పుడా.. ఎప్పుడో కలిపేసా! అని గర్వంగా వడ్డిస్తుంది ఇల్లాలు. రుచి చూసి- అమోఘంగా ఉంది, ఎలా పెట్టారో కనుక్కో అని భార్యతో అంటాడు అతిథి. మెచ్చుకోలుకి ఇల్లాలి మొహం మతాబులాగా వెలిగిపోతుంది. అతిథి గారి భార్య మొహం వాడిపోతుంది. అప్పటికి ఊరుకున్నా ఆటో ఎక్కాక మొగుడిని దులిపి పారేస్తుంది ఆవిడ. ‘‘ఏం మాయరోగం? మనింట్లో నేను పెట్టిన ఆవకాయ బాగానే మింగుతున్నారుగా? ఆవిడ ఎదురుగా ఆ సొల్లు వాగుడు ఎందుకు? అని తిట్లతో తలంటు పోస్తుంది. ఏమో! ఆ పారవశ్యంలో ఏదో అనేశాను. నువ్వనవసరంగా అపార్థం చేసుకోకు- అని సర్ది చెప్పుకుంటాడు ఆ మానవుడు. నిజమే- నేరం ఆయనది కాదు.. ఆవకాయది. అప్పుడన్ని తిట్లు తిన్నా నాలుగు రోజుల తరువాత ఎవరింటికైనా వెళ్లి అక్కడ ఆవకాయ తినగానే గతం మర్చిపోయి తెగ మెచ్చుకుని మళ్ళీ చివాట్లు తిని సీజనంతా ఇహ అదే గొడవ!
నేనూ పెట్టేశాను బోలెడు రకాలు. మా స్టోర్ రూంలో వాసెన కట్టిన జాడీలు చక్కగా కొలువుతీరాయి. గతంలో అవన్నీ చూస్తుంటే గర్వంగా వుండేది, ఇప్పుడు దిగులేస్తోంది. వర్తమానం వైభోగంగానే వుంది సరే. మరి భవిష్యత్తు మాటేవిటి? మేము మా పెద్దవాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నాం. మా తర్వాతి తరం ఈ విషయాలమీద దృష్టి పెట్టటం లేదు.
కూతురు గానీ, కోడలు గానీ పచ్చళ్ళు పెడితే లొట్టలేసుకుంటూ తింటారు గానీ ఎలా పెడుతున్నారా? అనే ఆసక్తి లేదు. మామిడికాయలు కొందాం రమ్మన్నా బద్ధకమే. ఆవకాయ కలుపుతున్నా.. వచ్చి చూడమన్నా బద్ధకమే. పోనీ వంటమీద ఆసక్తి లేదా? అంటే నడుము బిగించి, నడినెత్తిన కొప్పు పెట్టేసుకుని పనీర్ బటర్ మసాలాలూ, చైనీస్ ఫ్రైడ్ రైస్‌లూ బ్రహ్మాండంగా వండేస్తారు. ఆవకాయంటేనే అలుసు అందరికీ. పోనే్ల ఏ వంటల పుస్తకమో చూసి నేర్చుకుంటారని అనుకునేందుకు ఇదేం అల్లాటప్పా వ్యవహారం కాదు కదా! ఏ ఇంటి ఆవకాయ రుచి ఆ ఇంటిదే. నలుగురిని చంపితేనేగానీ డాక్టరు కాడు అన్నట్టు ఒకటి, రెండుసార్లు తగలెడితేగానీ ఆవకాయ పెట్టటం రాదు. కొన్ని చూసి నేర్చుకోవాలిగానీ చదివి నేర్చుకుంటే ఏడిచినట్టే వుంటుంది. పోనీ గట్టిగా కేకలేస్తే.. మనకే పాఠాలు చెప్తారు. అవన్నీ ఆరోగ్యానికి మంచివి కావు. ఆవకాయలో నూనె, ఉప్పూ వుంటుంది. బిపి, కొలెస్ట్రాలూ పెరిగిపోతుంది అంటారు. ఆ వితండ వాదన చూస్తుంటే చాచి పెట్టి రెండు లెంపకాయలు తగిలించాలనిపిస్తుంది. అంగుళం మందాన చీస్ వేసిన పిజ్జా తినొచ్చు. అరకిలో ఐస్‌క్రీం లాగించొచ్చు. వాటిలో లేని కొలెస్ట్రాలు, కాలరీలు ఆవకాయలో అడ్డం వస్తాయి బిడ్డలకి. గట్టిగా కోప్పడితే ఆవకాయ పెట్టడం మానేసెయ్యి అంటారు. అది అసాధ్యం. ఆక్సిజన్ లేకుండా ఎలా బతకలేమో ఆవకాయ లేకుండా ఆంధ్రులం బతకలేం.
ఈ రుచులన్నీ మాతరంతోనే సరా? మరుగున పడిపోయిన ఎన్నో మంచి విషయాల్లాగా ఆవకాయ ఇంట్లో పెట్టే అలవాటు కూడా అంతరించిపోతుందా? ఇప్పుడు అరిసెలూ, కజ్జికాయలూ బజార్లో కొనుక్కున్నట్టూ ఆవకాయ కూడా బజార్లో కొనుక్కుని.. ఆ ఏం బాగుందీ అని విరక్తి చెందుతారా? భావితరానికి ఇంట్లో పెట్టిన ఘుమఘుమలాడే ఆవకాయ తినే అదృష్టం కరువైపోతుందా? తలచుకుంటేనే గుండె చెరువైపోతోంది. కిం కర్తవ్యమ్?
ఒక పని చెయ్యాలి. మగవాళ్ళు విల్లు రాసి ఆస్తులు పంచినట్టూ ఆడవాళ్ళం ఆవకాయ పెట్టే విధానం వివరంగా పూస గుచ్చినట్టూ ఓ కాగితం మీద రాసి రిజిస్టర్ చేయిస్తే లాయరుగారు ఆ కాగితం పిల్లలకి అందజేస్తారు. మన తదనంతరం అయినా మన విలువ, ఆవకాయ విలువ గుర్తించి ఆవకాయ పెట్టుకుని ఆంధ్రుల ఉనికిని నిలబెడతారేమో చూడాలి. ఏదో మార్గం కనిపెట్టి ఆవకాయను కాపాడుకోవాలి. అదే మన తక్షణ కర్తవ్యం.
IMG_2120

 చూసారుగా ఎన్ని ముచ్చట్లో ! ఇక ఆవకాయ అంటే బాగా కారం తినే వాళ్లకి నెం 1 గుంటూరు ఆవకాయ  అని చెప్పాలి. కాని రోజులు మారయ్ కదా! కారం అంటే కడుపులో మంట,కళ్ళలలో నీళ్ళు ,  అల్సర్స్ వగైరా వగైరా అంటున్నారు. నిజమే ఆరోగ్యమే మహా భాగ్యం. కాబట్టి ఎవరి రుచికి తగినట్లు కారాలు వేసుకుని మన అంధ్రా స్పెషల్ ఆవకాయ విందారాగించండి!

Monday, January 27, 2014

Hyderabad Literary Festival (హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్)



2014 Republic Day  celebrations     

Photo: Day 3 of #HLF2014 will begin with the Republic Day flag hoisting ceremony at Kalpa School at 9:45 AM. Entry is open to all, so do join us.

(గణతంత్ర దినోత్సవ వేడుకలు)  దేశమంతా  జరుపుకుంది.                                                                                                                                                  

మన నగరంలోనూ బాగా జరిగాయి. దేశం రాజకీయ రంగులు పులుముకుంది. 
అయినా హైదరాబాద్ సాహిత్య ఫెస్టివల్ మాత్రం ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆహ్లాద వాతావరణం లో ముగిసింది 
Hyderabad Literary Festival         
మూడు రోజులనుంచి జరిగిన HYDERABAD LITERARY  FESTIVAL   ( హైదరాబాద్ లిటరరీ  ఫెస్టివల్) నగరం లో అనేక చోట్లలో జరిగింది. ముఖ్యంగా చిన్నారులలో, కథలు చెప్పి క్రియేటివిటీని పెంచటం, పుస్తక ప్రదర్శనలు, క్లే మోడల్స్, లతో పాటు  ప్రముఖ రచయితలూ, ప్రాంతీయ, రాష్ట్రీయ అంతర్జాతీయ రచయితల కొత్త  పుస్తకాలు విడుదల చేసారు. అనేక చర్చలు,  debate లు, ప్రముఖుల సూచనలు జరిగాయి.  
          నాట్య ప్రదర్సనలు, నాటకాలు, హైకూలు, సంగీతం, ఫోటోగ్రఫి, కథలు చెప్పటం,  పుస్తకాలు అచ్చు ఎలా వేస్తారు? వంటి ఎన్నో సాహిత్య ప్రక్రియలు ప్రముఖులచే ప్రదర్సించబడ్డాయి.        
          ఈ మూడు రోజుల సాహితీ యాత్రలో పాల్గొన్న ప్రముఖులు .... 
మన  భారతీయ నాట్య ప్రక్రియలో భాగంగా ప్రముఖ నర్తకి రాజేశ్వరి సాయినాథ్  నాట్యం అందరిని ఆకట్టుకుంది. ఆ కార్యక్రమం 24 జనవరి 2014న సాయంత్రం జరిగింది. 
అమల కూడా ఒక కార్యక్రమం లో అతిధి గా విచ్చేశారు. 
ఫోటోగ్రఫి లో  THOMAS LOTTGE (26th)
స్పీకింగ్ ఇన్ మెనీ voices  - GITHA HARIHARAN(25th)
Pens & Scalpels   - KAVERY NAMBISAN, VIJAY NAGASWAMI  (26th)... ఇలా వీరే కాదు ఎందరో 
ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. 

        H L F జనవరి 24-26 వరకు ఉదయం నుంచి జరిగిన ఈ కార్యక్ర మాలలో స్టూడెంట్స్ ఎక్కువగా కనిపించారు. తల్లి తండ్రులు, ఇంకా ఎందరో సాహితీ ప్రియులు తిలకించారు. 
               మేము చివరి రోజైన (26th ) ఈవెనింగ్ 4 గం. కల్పా  స్కూల్ లో జరిగిన స్టొరీ టెల్లింగ్  కార్యక్రమం కి హాజరయ్యాము. ఆ కార్యక్రమం దీపా కిరణ్ చెప్పిన కధలతో మొదలైంది.  
              ఆమె కథ లని  పిల్లలు, పెద్దలు  బాగా ఆనందించారు. పిల్లలని కూడా కథలో involve  చేస్తూ ప్రశ్నలు అడుగుతూ జవాబులు రాబడుతూ ఎంతో  ఆక్టివ్ గా కథలు ఆటలు పాటలు డాన్స్ లు చేస్తూ పిల్లలని ఆకట్టుకున్నారు 
ఆమె . 
 ఎంతో ఉత్సాహంగా జరిగింది ఆ కార్యక్రమం. పిల్లలకి కథలు చెబితే వారు కూడా ఆలోచించి క్రియేటివిటి తో వారు కూడా చిన్నప్పటి నుంచే కథలు చెప్పటం, రాయటం చేయగలరు. కథలు చెప్పటమా ఇంతేనా అనుకుంటాం కాని పిల్లలు తమ దృష్టిని కేంద్రి కరించేల చేసి కథలు చెప్పటం చాల కష్టం.   దీప కథలు  ఎంతో ఆసక్తి తో చెబుతారు.  హిందు దినపత్రికలో ఫ్రీ లాన్స్  రైటర్ గా , విధ్యార్ధులకి కథలు చెప్పటం వీరి హాబీ. విద్యార్ధులకి, టీచర్స్ కి, తల్లి తండ్రులకి స్టొరీ టెల్లింగ్ లో వర్క్ షాప్ లు నిర్వహిస్తుంటారు. 
HLF లో పాల్గొనటానికి ఈ సారి ఐర్లండ్, సింగపూరు, జర్మనీ, శ్రీలంకా, 
యు యస్ ఏ  వంటి దేశాల నుంచి రచయితలు పాల్గొన్నారు. మన దేశం నుంచి 
మహేష్ దత్తాని, రాజ్మోహన్ గాంధి, ఆనంద్ గాంధి, మృదుల గార్గ్ వంటి ఎందఱో 
ప్రముఖులు,  రచయితలు, రచయిత్రులు  వివిధ సాహితీ ప్రముఖులు హాజరయ్యారు. 
ఏంతో  వైభవంగా ముగిసాయి ఈ హైదరాబాద్ సాహిత్య పండుగ  రోజులు (ప్రదర్శనలు. )
         ఈ కార్యక్రమాలన్నీ ఆషియాన, కల్ప స్కూల్, సప్తపర్ణి లామకాన్, అల్ఫొన్సస్   (alphonsus)
కళాకృతి వంటి ప్రదేశాల్లో జరిగాయి. 
        ఎందరినో ఆకట్టుకున్నఈ లిటరరీ ఫెస్టివల్ ద్వారా మన సంస్కృతీ విలువలు, కళలు, వాటి విలువలు నేటి తరానికి అందజేయటం   వారిలో ఆలోచనలు రేకెత్తించి ఆయా కళల్లో సిద్ధ హస్తులని చేయటం......  
క్లే తో బొమ్మలు తయారు చేయటం, చర్చలు, ప్రముఖుల అనుభవాలు,  పసందైన విందులు,  చాట్ లు, విదేశీయుల నృత్యాలు, సంగీతాలు దీటుగా మన దేశపు శాస్త్రీయ సంగీతాలు ఎన్నో అంశాలతో పండుగ వాతావరణం తో బంజారా హిల్స్ లోని రోడ్ నం. 8 సందడిగా కనిపించింది. 
సాంకేతిక పరంగా పెరుగుతున్న నేటి యుగంలో సృజనాత్మక కళలు కూడా మనిషిలోని మానసికానందాన్ని కలగచేస్తాయి. 

ఇది చాలా చిన్న రివ్యూ మాత్రమే!
ఆసక్తి కల వారు ఈ కింది లింక్ లో వారి పూర్తి వివరాలు చూడచ్చు. 

Wednesday, January 15, 2014

Quiz-Swati weekly magazine

స్వాతీ వార పత్రికలో నేనెవరో తెలుసా   quiz  వచ్చింది  మీకు తెలిస్తే చెప్పండి ?ఇదుగో ఆర్టికల్ 



పైన ఇచ్చిన quiz కి జవాబు :కోపల్లె  హనుమంత రావు గారు 
ఆంధ్రజాతీయ కళాశాల వ్యవస్థాపకులు. 
నేను రాసిన పుస్తకం "దేశాభిమాని, విద్యాప్రదాత కోపల్లె హనుమంతరావు జీవిత చరిత్ర"
ఆధారంగా రాసిన పుస్తక సమీక్ష లాంటి ఈ వ్యాసం స్వాతి వార పత్రికలో రాసిన డా. దుగ్గరాజు శ్రీనివాసరావుగారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.