Search

Thursday, May 1, 2014

దేశోద్దారక కాశీ నాధుని నాగేశ్వర్రావు పంతులు గారు 


ఈరోజు ప్రముఖ పాత్రికేయుడు, స్వాత్రంత్ర్య సమరయోధుడు, రాజకీయనాయకుడు అయిన కాశీనాధుని నాగేశ్వర రావు పంతులుగారు పుట్టినరోజు. 1867 వ సంవత్సరంలో మే 1న జన్మించారు. కృష్ణాజిల్లా ఎలకుర్రు గ్రామంలో వీరి జన్మ స్థలం. తల్లి శ్యామలాంబ, తండ్రి బుచ్చయ్య. మచిలీపట్నంలో వీరి విద్యాభ్యాసం. మద్రాస్ క్రిష్టియన్ కాలేజీలో చదివారు. 'దేశోద్ధారక' అని ఆయనను అంతా గౌరవించేవారు. కందుకూరి వీరేశలింగం గారి వ్యాసాలు వీరిని ఎక్కువ ప్రభావితం చేసేవి. 
***


“పోయిందే… It’s gone” 
ఈ వాక్యాలు గుర్తున్నాయా?
ప్రముఖ తలనొప్పి బామ్ కాప్ష్ న్ ఇది. తలనొప్పి, కాళ్ళనొప్పి, చేయ్యినోప్పి, మెడనొప్పి ఇలా శరీరంలో ఏ రుగ్మతలోచ్చినా వాడే బామ్ అమృతాంజనం. పసుపురంగులో చాలా ఘాటుగా కళ్ళవెంట నీళ్ళు తెప్పించినా ప్రతి ఒక్కరు ఆ రోజుల్లో వాడే బామ్ అమృతాంజనం. దీన్ని కనిపెట్టి అందరికీ అందుబాటులోకి తెచ్చిన వారు కాశీనాధుని నాగేశ్వర రావు గారు. నేటికీ ఎంతో మంది దీన్నే వాడుతున్నారు. 
మద్రాసు, కలకత్తా, ముంబాయి నగరాల్లో వ్యాపారాలు చేసారు. ముంబై లో విలియం అండ్ కంపెనీ అనే విదేశీ సంస్థలో కొంత కాలం పని చేసారు. ఆ సంస్థ యజమాని తమ దేశం వెడ్తూ ఆ కంపెనీని శ్రీ కాశీ నాదుగారికి అప్పగించారు. దాంతో ముంబై లో 1893 లో అత్యంత ప్రాచుర్యం పొందిన అమృతాంజనం లిమిటెడ్ ని స్తాపించారు. 
1907 లో అఖిల భారతీయ కాంగ్రెస్ మహాసభలు సూరత్ లో జరిగినపుడు పాల్గొన్న ఆయనకి తెలుగులో కూడా వార్తా సమాచారాలను అందించాలి అని అనుకున్నారు. 1908 సెప్టెంబర్ లో అయన ముంబాయి నుంచి ఆంధ్ర పత్రికను ప్రారంభించారు ఆ రోజుల్లో దేశీయ పత్రికలపై ఆంగ్ల ప్రభుత్వం ఆంక్షలు విధించేది. అయినా ఆయన ఎంతో ధైర్యంతో అంకిత భావంతో ఆ పత్రికని నడిపించారు. వారపత్రిక, దినపత్రిక వెలువడేవి. యుద్ధ పరిస్తితులు, మారుతున్న పరిణామాలు,తెలుగువారికి అందించేవారు. వారు ఎందరో రచయితలని ప్రోత్సహించే వారు. 

ఈ పత్రిక ముంబై నుంచి 1914లో మద్రాసు నుంచి వెలువడేది. ఇదే తొలి తెలుగు పత్రిక. 1924 లో భారతి అనే సాంస్కృతిక, సాహితీ పత్రిక ప్రారంభించారు. అలాగే అంద్రోద్యమ కాలంలో కూడా స్వరాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ప్రచారంలో పత్రిక విశేషమైన కృషి చేసింది. అంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు లోనూ ఆ పత్రిక ఎంతో కృషి చేసింది. 
మద్రాస్ లో జరిగిన అంధ్ర మహాసభలో తెలుగు భాష, సంస్కృతిలకు అయన చేసిన సేవలను గౌరవిస్తూ ఆయనను ‘దేశోద్ధారక’ అని బిరుదునిచ్చి సత్కరించారు. నాగేశ్వర రావు పంతులు గారు ‘అంధ్ర గ్రంధమాల’ అనే ప్రచురణ సంస్థని ప్రారంభించి అనేక పుస్తకాలను ముద్రించారు. 
గ్రంధాలయోద్యమానికి నాగేశ్వరరావు గారిని పితామహునిగా అభివర్ణించచ్చు . 
అటు పత్రికారంగంలోను వ్యాపార రంగోలోనూ వుంటూనే రాజకీయ ప్రవేశం చేసారు. నాలుగుసార్లు ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగా వున్నారు. ఖద్దరు ఉద్యమాని కి తన మద్దతుని అందించారు. ఉప్పుసత్యాగ్రహం లో పాల్గొన్నారు. ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. 
వీరి ఇల్లు ఎప్పుడూ బంధు మిత్రులతో, అతిధులతో కళ కళలాడుతూ వుండేది. ఉట్టి చేతులతో ఎవరినీ పంపేవారు కాదు దానశీలి అందుకే మహాత్మా గాంధీ ఆయనను విశ్వదాత అని కోడియాడారు. 
అంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. 
రాజకీయ రంగంలో …
నాగేశ్వర రావు పంతులు గారు నాలుగుసార్లు ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షులుగా వున్నారు. 
1935 లో రాష్ట్ర శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. ఉప్పు సత్యా గ్రహ సమరం లో ఏడాది పాటు జైలు శిక్షను కూడా అనుభవించారు. 
ముఖ్యంగా అంధ్రపత్రిక చాలా కాలం వరకు నిర్విఘ్నంగా నడిచింది. వీరి తదనంతరం వీరి అల్లుడు శివలెంక శంభు ప్రసాద్ ఈ పత్రికని మరింతగా అభివృద్ధి చేసారు. దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు గారు 1938 ఏప్రిల్ 11న మరణించారు. 
పత్రికా రంగంలో వీరు చేసిన విశేషమైన కృషి, ఒక సంపాదకుడుగా ఎందరికో మార్గదర్శి. వారు రాసిన సంపాదకీయాలు, వ్యాసాలు, విశ్లేషణలు ఇంకా ఎన్నో సాహితీ ప్రక్రియల్లో వారు చేసిన చేసిన కృషి నేటి సంపాదకులకి, విలేఖరులకి మార్గదర్శకుడు. అందుకే ఈరోజున కనీసం వారిని తలుచుకోవటం మన కర్తవ్యం. 
శ్రీ కాశీ నాధుని నాగేశ్వర రావు గారు స్వదస్తూరి టో రాసిన లేఖ. 
            
1969 లో వారి పేరు మీద విడుదలైన పోస్టల్ కవర్. 

 Mani Kopalle's photo.

1 comment:

  1. గొప్ప వ్యక్తి గురించి మంచి టపా వ్రాసారు. శ్రీ నాగేశ్వర రావు పంతులు గారి పేరు మీద మద్రాసు లోని మైలాపూర్ లో "నాగేశ్వరరావు పార్క్" అని కూడా ఉన్నట్లు గుర్తు. అంతటి ప్రసిద్ధ తెలుగు పత్రికా రంగ మహాశయుడి జయంతి గురించి ఈనాటి పత్రికా రంగం పట్టించుకున్నట్లు కూడా లేదు. మీరు బ్లాగ్లో వ్రాసి మంచి పని చేసారు.

    (మీరు మచిలీపట్నం లోని నేషనల్ కాలేజ్ - ఇప్పటి ఆంధ్ర జాతీయ కళాశాల - వ్యవస్ధాపకులైన శ్రీ కోపల్లె హనుమంత రావు గారి వంశీయులా? మీ పై టపాలో Mani Kopalle's photo అని కనిపిస్తే అనిపించింది. వారి జీవిత చరిత్ర వ్రాసిన మణి గారు మీరేనా?)

    ReplyDelete