ఆవకాయ ముచ్చట్లు
వచ్చేసింది ఎండాకాలం! దానితో పాటే ఆంధ్రుల ఆవకాయ, మాగాయలు పెట్టుకునే రోజులు వచ్చేసాయి. ఈ ఏప్రిల్, మే నెలల్లో ఎ ఇంట చూసినా ఆవకాయ ముచ్చట్లే! ఎన్ని రకాలు పెట్టచ్చు ఎంత పెట్టచ్చు ఇంకా ఇంకా చాలా చాలా కబుర్లే వుంటాయి. ఆ వూసులు నేను చెప్పేకంటే …. ప్రముఖ హాస్య కధా రచయిత్రి, అన్నిటికి మించి మా స్నేహితురాలు, ఆత్మీయురాలు శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు మనందరితో ఒక పత్రికా ముఖంగా మనందరితో మాట్లాడిన ముచ్చట్లు ఒకసారి గుర్తు చేస్తే సరిపోతుంది అనిపించింది. ఇదిగో ఇవే అవి .......
ఆవకాయను కాపాడుకోవడం ఎలా?
మే నెల అంతా ఎక్కడ.. ఏ ఇద్దరు ఆడవాళ్ళు కలుసుకున్నా, ఫోన్‌లో మాట్లాడుకున్నా ఒకటే టాపిక్- ఊరగాయల పనులు అయ్యాయా? ఇక ఆ విషయం గురించి బోలెడంత చర్చ.
మామిడికాయలు ఎక్కడ కొన్నారు? గడ్డి అన్నారంలోనా? గుడి మల్కాపూర్‌లోనా? మోండా మార్కెట్‌లోనా? నల్లకుంటలోనా? ఆవకాయకి చిన్న రసాలు కొన్నారా? గులాబీ రకమా?
కారం, ఆవపిండీ కొంటారా? మిషను ఆడిస్తారా? పప్పు నూనేగా? ఏవేం పచ్చళ్ళు పెట్టారు?-అని ఆరాలు.
ఆవకాయ సరే- అందరూ పెడతారు.. పెసరావకాయ, మాగాయ, మెంతికాయ, తొక్కుడు పచ్చడి.. ఇలా ఎవరెన్ని రకాలు పెడితే అంత గొప్పగా, గర్వంగా చెప్పుకుంటారు. ఒక్కోసారి వాదోపవాదాలు కూడా వస్తాయి.
మా వైపు ఆవకాయ రుచే వేరు. శనగలు వేస్తాం ఆవకాయలో అని గుంటూరు జిల్లా వదినగారు అంటే, చాల్లెండి గోంగూర, కొరివి కారం మాత్రమే మీవి. ఆవకాయలు మా గోదావరి జిల్లా వారి సొత్తు. మేము పెట్టినన్ని వెరైటీలు ఎవరూ పెట్టరు. నువ్వుపిండి ఆవకాయ, పచ్చావకాయ, నీల్లావకాయ, ఎండావకాయ అంటుంది మరో అక్కగారు. ఎవరెన్ని రకాలు పెట్టినా మా బెల్లం ఆవకాయ తరువాతనే అంటుంది శ్రీకాకుళం పిన్నిగారు.
భార్యామణి కొత్తావకాయ ఎప్పుడు రుచి చూపిస్తుందా? అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ వుంటారు మగవాళ్ళు. అదేవిటో.. ఆవకాయకి, పురుషపుంగవులకీ అవినాభావ సంబంధం.
ఈ సీజన్లో ఎవరింటికి భోజనానికి వెళ్లినా కంచం ముందు కూచోగానే కొత్తావకాయ కలిపేసారా? అనే అడుగుతారు. ఇప్పుడా.. ఎప్పుడో కలిపేసా! అని గర్వంగా వడ్డిస్తుంది ఇల్లాలు. రుచి చూసి- అమోఘంగా ఉంది, ఎలా పెట్టారో కనుక్కో అని భార్యతో అంటాడు అతిథి. మెచ్చుకోలుకి ఇల్లాలి మొహం మతాబులాగా వెలిగిపోతుంది. అతిథి గారి భార్య మొహం వాడిపోతుంది. అప్పటికి ఊరుకున్నా ఆటో ఎక్కాక మొగుడిని దులిపి పారేస్తుంది ఆవిడ. ‘‘ఏం మాయరోగం? మనింట్లో నేను పెట్టిన ఆవకాయ బాగానే మింగుతున్నారుగా? ఆవిడ ఎదురుగా ఆ సొల్లు వాగుడు ఎందుకు? అని తిట్లతో తలంటు పోస్తుంది. ఏమో! ఆ పారవశ్యంలో ఏదో అనేశాను. నువ్వనవసరంగా అపార్థం చేసుకోకు- అని సర్ది చెప్పుకుంటాడు ఆ మానవుడు. నిజమే- నేరం ఆయనది కాదు.. ఆవకాయది. అప్పుడన్ని తిట్లు తిన్నా నాలుగు రోజుల తరువాత ఎవరింటికైనా వెళ్లి అక్కడ ఆవకాయ తినగానే గతం మర్చిపోయి తెగ మెచ్చుకుని మళ్ళీ చివాట్లు తిని సీజనంతా ఇహ అదే గొడవ!
నేనూ పెట్టేశాను బోలెడు రకాలు. మా స్టోర్ రూంలో వాసెన కట్టిన జాడీలు చక్కగా కొలువుతీరాయి. గతంలో అవన్నీ చూస్తుంటే గర్వంగా వుండేది, ఇప్పుడు దిగులేస్తోంది. వర్తమానం వైభోగంగానే వుంది సరే. మరి భవిష్యత్తు మాటేవిటి? మేము మా పెద్దవాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నాం. మా తర్వాతి తరం ఈ విషయాలమీద దృష్టి పెట్టటం లేదు.
కూతురు గానీ, కోడలు గానీ పచ్చళ్ళు పెడితే లొట్టలేసుకుంటూ తింటారు గానీ ఎలా పెడుతున్నారా? అనే ఆసక్తి లేదు. మామిడికాయలు కొందాం రమ్మన్నా బద్ధకమే. ఆవకాయ కలుపుతున్నా.. వచ్చి చూడమన్నా బద్ధకమే. పోనీ వంటమీద ఆసక్తి లేదా? అంటే నడుము బిగించి, నడినెత్తిన కొప్పు పెట్టేసుకుని పనీర్ బటర్ మసాలాలూ, చైనీస్ ఫ్రైడ్ రైస్‌లూ బ్రహ్మాండంగా వండేస్తారు. ఆవకాయంటేనే అలుసు అందరికీ. పోనే్ల ఏ వంటల పుస్తకమో చూసి నేర్చుకుంటారని అనుకునేందుకు ఇదేం అల్లాటప్పా వ్యవహారం కాదు కదా! ఏ ఇంటి ఆవకాయ రుచి ఆ ఇంటిదే. నలుగురిని చంపితేనేగానీ డాక్టరు కాడు అన్నట్టు ఒకటి, రెండుసార్లు తగలెడితేగానీ ఆవకాయ పెట్టటం రాదు. కొన్ని చూసి నేర్చుకోవాలిగానీ చదివి నేర్చుకుంటే ఏడిచినట్టే వుంటుంది. పోనీ గట్టిగా కేకలేస్తే.. మనకే పాఠాలు చెప్తారు. అవన్నీ ఆరోగ్యానికి మంచివి కావు. ఆవకాయలో నూనె, ఉప్పూ వుంటుంది. బిపి, కొలెస్ట్రాలూ పెరిగిపోతుంది అంటారు. ఆ వితండ వాదన చూస్తుంటే చాచి పెట్టి రెండు లెంపకాయలు తగిలించాలనిపిస్తుంది. అంగుళం మందాన చీస్ వేసిన పిజ్జా తినొచ్చు. అరకిలో ఐస్‌క్రీం లాగించొచ్చు. వాటిలో లేని కొలెస్ట్రాలు, కాలరీలు ఆవకాయలో అడ్డం వస్తాయి బిడ్డలకి. గట్టిగా కోప్పడితే ఆవకాయ పెట్టడం మానేసెయ్యి అంటారు. అది అసాధ్యం. ఆక్సిజన్ లేకుండా ఎలా బతకలేమో ఆవకాయ లేకుండా ఆంధ్రులం బతకలేం.
ఈ రుచులన్నీ మాతరంతోనే సరా? మరుగున పడిపోయిన ఎన్నో మంచి విషయాల్లాగా ఆవకాయ ఇంట్లో పెట్టే అలవాటు కూడా అంతరించిపోతుందా? ఇప్పుడు అరిసెలూ, కజ్జికాయలూ బజార్లో కొనుక్కున్నట్టూ ఆవకాయ కూడా బజార్లో కొనుక్కుని.. ఆ ఏం బాగుందీ అని విరక్తి చెందుతారా? భావితరానికి ఇంట్లో పెట్టిన ఘుమఘుమలాడే ఆవకాయ తినే అదృష్టం కరువైపోతుందా? తలచుకుంటేనే గుండె చెరువైపోతోంది. కిం కర్తవ్యమ్?
ఒక పని చెయ్యాలి. మగవాళ్ళు విల్లు రాసి ఆస్తులు పంచినట్టూ ఆడవాళ్ళం ఆవకాయ పెట్టే విధానం వివరంగా పూస గుచ్చినట్టూ ఓ కాగితం మీద రాసి రిజిస్టర్ చేయిస్తే లాయరుగారు ఆ కాగితం పిల్లలకి అందజేస్తారు. మన తదనంతరం అయినా మన విలువ, ఆవకాయ విలువ గుర్తించి ఆవకాయ పెట్టుకుని ఆంధ్రుల ఉనికిని నిలబెడతారేమో చూడాలి. ఏదో మార్గం కనిపెట్టి ఆవకాయను కాపాడుకోవాలి. అదే మన తక్షణ కర్తవ్యం.
No comments:
Post a Comment