తెలుగు వారి అభిమాన రచయిత్రి , రేడియో అక్కయ్య శ్రీమతి తురగా జానకి రాణి గారు పరమ పదిం చారని తెలిసి ఈ పోస్ట్ చేయకుండా వుండలేక పోతున్నాను. వారిని ఒక వెబ్ సైట్ కోసం ఇంటర్వ్యూ తీసుకున్న సందర్భం ఇది. నా జ్ఞాపకాలలో వారి కి నేనిచ్చే అక్షర నివాళి
రేడియో అక్కయ్య: "తురగా జనకీరాణి"గారితో తో ముఖా ముఖి
పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించి, చిన్నారులతో ప్రదర్శింపచేశి ఆలిండియా రేడియోలో నేటికీ రేడియో అక్కయ్యగా అందరి మదిలో మెదిలే వ్యక్తి తురగా జానకీ రాణిగారు. మంచి రచయిత్రి, సంఘ సంస్కర్త కూడా
మానవుని వినోద సాధనాలు ఎన్ని వచ్చినా నేటికీ వన్నె తరగని సాధనం రేడియో! ఏ పని చేస్తున్నా చెవులు రిక్కించి వినేది ఆకాశవాణి కార్యక్రమాలే! ఆలిండియా రేడియోలో నేటికీ రేడియో అక్కయ్యగా అందరి మదిలో మెదిలే వ్యక్తి తురగా జానకీ రాణిగారు. ఎందరో చిన్నారులు బాలానందంలో తమ కంఠం వినిపించడం వెనుక ఆమె ఉన్నారు. పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను ఆవిడ రూపొందించి వాటిలో చిన్నారులతో ప్రదర్శింపచేశారు. ఎందరో బాలబాలికలకి పబ్లిక్ స్పీకింగ్ భయంపోయి మైక్ లో ధైర్యంగా మాట్లాడటానికి.. వారిలోని సృజనాత్మకతకు ..ఇలా ఎన్నో విషయాలకిబాలానందం ఒక వేదిక అయింది. డాక్టర్లు, లాయర్లు, సినీ తారలు , ఎన్.ఆర్.ఐలు... ఒకరేమిటి ఎందరో ప్రముఖులు తామకు చిన్నతనంలో ఆకాశవాణిలో రేడియో అక్కయ్యతో వున్న అనుభవం మర్చిపోలేరు. నేటికీ ఆమెను ఒక ఆత్మీయురాలిలాగా పలకరిస్తుంటారు...
రేడియో ఆర్టిస్ట్ గానాటకాలలోనూ, ఇతర కార్యక్రమాలలోనూ విశేష అనుభవం వున్నతురగా జానకీ రాణి గారు1975 లో ఆకాశవాణిలో ఉద్యోగంలో చేరారు. 1994లో ఐ.బి.పి.ఎస్. అసిస్టెంట్ డైరెక్టర్ గా పదవీ విరమణ చేశారు.
వారితో వారి రేడియో అనుభవాల గురించి కాసేపు...
* ఆకాశవాణిలో మీ ఉద్యోగ బాధ్యతలు ఎలా వుండేవి?
ఛాలెంజింగ్ గా వుండేది. సమయపాలన పాటించడంతో పాటు శ్రోతలకీ న్యాయం చేకూర్చాలి. 1975లో ఉద్యోగంలో చేరినప్పుడు మనదేశంలో ఎమర్జెన్సీ అమలులో ఉండేది. ఆకాశవాణి ద్వారా ప్రభుత్వ పాలసీలు, విధానాలు ప్రజలకి చేరవేయాలి.ఒక ఛాలెంజింగ్ గా వుండేది....నేను ఏ కార్యక్రమం చేసినా ఆమోదించేవారు. స్వేచ్ఛ వుండేది. కార్యక్రమాల్లో వైవిధ్యం రూపొందిచడానికి ప్రయత్నించేదాన్ని.
బాలానందంద్వారా పిల్లల వినోదం, విజ్ఞానం కోసం నాటికలు, రూపకాలు,సంగీత, సాహిత్యకర్యక్రమాలు, ఇలా ఎన్నో కార్యక్రమాలు రూపొందించేవాళ్లం. కొన్ని పెద్దల ద్వారా చెప్పిన విషయాలు బాగుంటాయి. బాలానందం ద్వారా ఎన్నో ప్రయోగాలు చేశాను.
మహిళలకోసం కూడా కొత్త ప్రయోగాలు చేసాము. ముఫై సంవత్సరాల కిందటే "ఇది నా సమస్య" అని స్త్రీల కార్యక్రమం ప్రసారం చేసేవాళ్ళం. స్త్రీలు తమ సమస్యలు ఉత్తరాల ద్వారా తెలియ పరిస్తే వాటి పరిష్కారాలు నిపుణులైన డాక్టర్లు, లాయర్లు మొదలైన వారిచే చెప్పించే వాళ్ళం. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వుండేది. వందల సంఖ్యల్లో వుత్తరాలు వచ్చేవి. వృద్ధుల కోసం తమ జీవితానుభవాలు తెలిపే "స్రవంతి" అనే కార్యక్రమం మొదలు పెట్టాము. అది ఇప్పటికీ కొనసాగుతోంది. అందరికీ చదువు అని పంచాయితీలలోని స్త్రీలకి పాఠాలు అందించేవాళ్ళం... మహిళలు వారు రాసిన కవితలు, కధలు, పాటలు ఈ కార్యక్రమంద్వారా వినిపించేవాళ్ళు....
* ఆకాశవాణిలో ఒక కార్యక్రమంరూపుదిద్దుకోవడానికి ప్రోగ్రామర్ బాధ్యత ఏవిధంగా వుంటుంది?
ఒక కార్యక్రమం రూపొందించాలంటే ముఖ్యంగా మూడు విషయాలు గమనించాలి.
1. ప్లానింగ్, 2.ప్రోడక్షన్ 3. ప్రెజెంటేషన్. ప్లానింగ్ పర్ ఫెక్ట్ గా వుండాలి. తరువాత ప్రొడక్షన్ లో విలువలుండాలి. ప్రెజెంటేషన్ లో ముఖ్యంగా. అది అందర్నీ ఆకట్టుకునేలా వుండాలి. ఈ మూడు కలిపి తేనే ఏ కార్యక్రమమైనా చక్కగా వుంటుంది. నేను ఎక్కువగా సంగీతాన్ని ఉపయోగించేదాన్ని.
* ఆకాశవాణి గురించి ఇతర విషయాలు గురించి అడిగిగినపుడు
రేడియో కార్యక్రమానికి మానవ కంఠ ధ్వని, ఇతర శబ్దాలు, విరామం ఎంతో ముఖ్యం. అలాగే రేడియోలో పాల్గొనే వారు ఎక్సపర్ట్స్ కానవసరం లేదు. ఎక్స్‌పీరియన్స్ ముఖ్యం. చెప్పదలచిన విషయాన్ని ఇచ్చిన సమయానికి సమయపాలన పాటించి చెప్పగలగాలి. వృద్ధులు చెప్పే దాంట్లోనూ విలువలుంటాయి.
రేడియో అనేది స్టూడియో నాలుగు గోడల మధ్య ఉండేది కాదు. ప్రజల మధ్యకి వెళ్ళి వారి అనుభవాలు, వాళ్ళ నాలెడ్డ్ తెలుసుకోవాలి అని చాలా క్రార్యక్రమాలు ప్రజల వద్దకి వెళ్లి చేసేవాళ్ళం. సాధారణ ప్రజలని కూడా ఇందులో భాగస్వామ్యులని చేయటం ద్వారా వారి అనుభవాలు నలుగురికీ తెలిసేవి. ఇందులో భాగంగా మేము గోదావరిఖని, జడ్చర్ల, కరీంనగర్, శ్రీశైలం....ఇలా ఎన్నో ప్రదేశాలు తిరిగి కార్యక్రమాలు రూపొందించేవాళ్ళం.
* ఇతరులతో కలిసిపని చేసిన అనుభవాల గురించి....?
ఉద్యోగ నిర్వహణలో భాగంగా ఎందరో పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి పని చేశాను. దేవుల పల్లి కృష్ణ శాస్త్రిగారు, స్ధానం నరసింహారావుగారు, వేలూరి శివానంద్ , గోపీచంద్.... ఇలా ఎందరో వున్నారు. వివిధ రంగాలలో ప్రసిద్ధులైన వారు, సినీ రంగ ప్రముఖలు అక్కినేని నాగేశ్వరరావు, యస్.పి. బాలసుబ్రమణ్యం, జె.వి. సోమయాజులు, మంజు భార్గవి, ఇంకా ఎందరో నటీ నటులతో కలిసి కార్యక్రమాలు రూపొందించాను.
వందకి పైగా కధలు రచించాను. అవి మూడు సంపుటాలుగా వెలువడ్డాయి. మూడు నవలలు, ఐదు బాలసాహిత్యం మీద పుస్తకాలు వచ్చాయి అనువాద రచనలు కూడా మూడు వచ్చాయి. అగమ్య గమ్య స్ధానం అనే కధకి రాచ కొండ విశ్వనాధ శాస్త్రిగారు అభినందిస్తూ ఉత్తరం రాశారు. ఆ కధ ఇంగ్లీషులోకి తర్జుమా అయింది కూడా... ఇప్పటికీ రచనలు కొనసాగుతున్నాయి. ఇటీవలే డా. దుర్గాబాయి దేశ్ ముఖ్ గురించి రూపకం ఆకాశవాణికి రాసిచ్చాను.
* జానకీ రాణి గారూ! మీరు మంచి రచయిత్రే కాదు మంచి సంఘ సంస్కర్త కూడా.... ఆ అనుభవాలు కూడా మాతో పంచుకోండి....
యూనిసెఫ్ లో నూ, ఎన్.సి.ఆర్.టి., ప్రభుత్వ శాఖల కోసం ... పని చేసేటప్పుడు బాల జాగృతి (బా జా)అనే కార్యక్రమం చేపట్టి 670 street shows (వీధి ప్రదర్శనలు) చేశాము. బాలల హక్కులు, సమస్యలు, బాల కార్మిక నిర్మూలన, ఇత్యాది ఎన్నో విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించేవాళ్లం. సామాజిక స్పృహ వున్న విషయాలు, సృజనాత్మక సందేశాలు పిల్లలు, యువతీ యువకులు శిక్షణ పొంది ప్రదర్శించేవాళ్లు.
"మా చేతి పంపు-మా బిందె నింపు" అనే సోషల్ ఎవేర్ నెస్ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది.
*ప్రస్తుతం వస్తున్న వివిధ రేడియో ఎఫ్.ఎం. స్టేషన్ల గురించి మీ అభిప్రాయం?
కొత్త ట్రెండ్స్ ని ఆపలేం... రేడియో ప్రయోజనం మారింది. అందరికీ టి.వి. చూసే సమయం వుండటం లేదు. ఉద్యోగాల రీత్యా... ఉరుకులు పరుకుల జీవిత విధానంలో రిలాక్స్ గా ఇప్పుడు అందరూ రేడియో వినడానికే ఇష్ట పడుతున్నారు. కారులో ప్రయాణిస్తూ కూడా రేడియోనే వింటున్నారు.
రేడియో అంటేనే "బహుజన హితాయ... బహుజన సుఖాయ... !" రేడియో ద్వారా హితం పలుకుతాం... అందరికి సుఖాన్ని అందిస్తాం. సంఘంలోని సంస్కృతిని నిలపటానికి ఉంది. సమాజం లో జరిగే మార్పులు ప్రజలకు తెలిపేలా ఉపయోగ పడే సాధనం రేడియో. .. అంటారు తురగా జానకీ రాణిగారు.
* ----ఈ ఇంటర్వ్యు తీసుకుని దాదాపు 7 సంవత్సరాల అవుతోంది. అనంతరం కూడా వారు ఎన్నో అవార్డులు, సత్కారాలు అందుకోవటం. స్వీయ రచనల పుస్తకాలు ప్రచురించటం, ఇంకా ఎన్నో సంఘటనలు కాల వాహినిలో జరిగాయి. ఇది బాలానందం పిల్లలు అభిమానించే రేడియో అక్కయ్య గా వారితో జరిపిన ముఖా ముఖి.....
No comments:
Post a Comment