Search

Wednesday, June 10, 2015

నివాళి

  డా . దాశరధి రంగాచార్య  



ప్రముఖ సాహితీ వేత్త, తెలంగాణా పోరాట వీరుడు, ఫిలాసఫర్, అక్షర వాచస్పతి అయిన డా. దాశరధి రంగాచార్య 08 06 15న కనుముసారు. వారు సాహితీ లోకానికి ఎనలేని సేవ చేసారు.  నేను ఒకసారి ప్రముఖ రచయిత్రి వాసా ప్రభావతి గారితో కలిసి దాశరధి రంగాచార్య గారింటికి వెళ్ళాను. అప్పటికే వారు అస్వస్తులుగా వున్నారు. మంచం మీదే వుండి మాతో మాట్లాడారు.  వారితో కలిసి సాహిత్య  చర్చ జరగటం మరపురాని అనుభవం.  ఆతరువాత వారు కేంద్ర సాహిత్య అకాడమీ వారు (తెలుగు )ఏర్పాటు చేసిన రచయిత తో ముఖా ముఖి కార్యక్రమానికి అతి కష్టం మీద వీల్ ఛైర్లో వచ్చి సాహిత్య అకాడమీ వారు ఘనంగా ఏర్పాటు చేసిన సత్కారాన్ని అందుకున్నారు. ఆ సందర్భంగా సభలో పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. తన గురించి, తన అనుభవాలు చెప్పారు. 
తెలుగు వారికి  వచన వేదాలు అందించిన    డా॥ దాశరధి రంగాచార్య గారు   తమ విలువైన అభిప్రాయాలను ఆహుతులతో పంచుకున్నారు.  
"వేదాలను అందరు చదవచ్చు. వేదం అందరికి వర్తిస్తుంది. వేదం భారతీయులది మాత్రమే, వీళ్ళు మాత్రమే చదువుతారు " అనుకోవటం సంకుచిత తత్త్వం అవుతుంది. ఎందు కంటే వేదాన్ని అనువదించని భాష లేదు ప్రపంచంలో. వేదానికి స్వర శాస్త్రం వుంది. స్వరాలూ వున్నాయి. కాని స్వరం తెలిసిన వారు లేరు. వేదం కాని రామాయణ భాగవత పురాణాలు కాని ఉప పురాణాలు కాని  మానవ జాతి   కోసం  చెప్పినవే తప్ప ఏ ఒక్క భాష కోసమో చెప్పలెదు.    ప్రపంచ  భాషలకు మాధ్యమం సంస్కృతం. కొన్ని జాతుల వారు మాత్రమే సంస్కృతం చదవాలన్నారు. కానీ వేదం అందరిదీ. అందరూ చదవఛు. వేదం ప్రజలందరి కోసం రాయబడింది. వేదం లో ఏముందో బైబిల్, ఖురాన్ లలో కుడా ఇదే వుంది . 
పరమాత్మ ఒక్కడే . ఈ జగత్ అంతా పరమాత్ముని సృష్టి.  సత్యమే పరమాత్మ. సత్యం కంటికి కనిపించదు. సత్యం ఏమిటి అనేది వ్యాసుడు రచించిన భరతం వివరిస్తుమ్ది. భారత దేశపు సాత్విక పరంపరలో సత్యం, ధర్మం వున్నాయి. సత్యానికి గాని ధర్మానికి గాని ఇతమిద్దమైన వ్యాఖ్యలుండవు. అని అన్నారు. 

పండితుడు రచయితా కావటం కష్టం రచయిత తత్వవేత్త కావటం మరీ కష్టం. ఫిలాసఫర్ కావటం అంత కంటే మరీ కష్టం. నేను భగవంతుని తప్ప ఎవరిని నమ్మలేదు. " అని అన్నారు.

డా|| దాశరధి రంగా చార్య  వరంగల్లు జిల్లాలోని చిన్న గూడూరు గ్రామంలో జూలై 24, 1928న వెంకటమ్మ, వెంకటాచార్య దంపతులకు జన్మించారు.
వీరి అన్నగారు దాశరధి కృష్ణ మాచార్య . ఆస్తాన కవిగా వుండేవారు. వీరు సినీ రచయితగా ప్రసిద్ధులు. 
దాదాపు 75 వసంతాలకు పైగా ప్రజా సేవ చేశారు. నిజాం పాలనకి వ్యతిరేకంగా పోరాటాలు సలిపిన వ్యక్తి. తమ తల్లి చేసిన త్యాగం, అన్న దమ్ములిద్దరు పోరాటాలు జరిపిన సంఘటనలు గుర్తు చేసుకుని "మాది త్యాగాల కాలం.  తెలంగాణా తల్లి మీద అభిమానంతో పోరాటాలు సాగించే వాళ్ళం." అన్నారు.  
దాశరధి రంగా చార్య గారు కాకతీయ విశ్వ విద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు .
తెలుగు వారికి భారత తాత్వికతను అందించాలనేది వీరి ధ్యేయం, సంకల్పం. లక్ష్యం.
తెలంగాణ మాండలికంతో వీరి కలం నుండి వెలువడిన తొలి నవల "చిల్లర దేవుళ్ళు" విశేషమైన ప్రచారం పొందింది. ఈ నవల  చలన చిత్రంగా, రేడియోలో నాటకంగా, యునివర్సిటీ   విద్యార్ధులకు పాఠంగా ... ఇలా పలు రూపాల్లో వచ్చింది. వీరి గురించి ఎంత రాసినా ఇంకా మిగిలి పోతుంది.
అపర బృహస్పతి, అక్షర వాచస్పతి, వేదం వారసత్వం పంచిన విప్లవకారుడు, వేదాన్ని ప్రజల వద్దకు తెచ్చిన దాశరధి,  ... ఇలా బిరుదాలతో ప్రముఖ పత్రికలు వీరిని కీర్తించాయి.
ఆధ్యాత్మిక వేత్త అయిన దాశరధి గారు రామాయణ, భాగవతాలను సులభ వచనంలో రచించారు. వేదాలతో పాటు, ఉపనిషత్ లను కూడా రచించారు. వేదాలతో పాటు ఆధునిక రచనలు కూడా చేశారు. ఉర్దూలో కూడా కవితా రచనలు చేశారు. దాదాపు 90కి పైగా రచనలు చేసిన వీరి సాహితీ పేజీలు 16,000 పైగానే వున్నాయి. 
అవార్డులు :

  • చిల్లర దేవుళ్ళు తొలి నవలకు అంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డు (1970)
  • పులుపుల శివయ్య స్మారక అవార్డు గుంటూరు (1990), 
  • యువకళావాహిని గోపి చంద్ అవార్డు (1993), 
  • సాహితీ హారతి రజిత కిరీట పురస్కారం, ఖమ్మం, (1994), 
  • గోవిందరాజు సీతాదేవి అవార్డు (1995), 
  • పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారం (2001). 
  • నాటి ఉమ్మడి అంధ్ర ప్రదేశ్ హంస అవార్డు (2006), 
  • అంధ్రప్రదేశ్ రాజీవ్ ప్రతిభా అవార్డు (2009) 
  • అజో విభో వారి ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు. 

వీరి సాహితీ ప్రస్తానం లో ఎన్నో సత్కారాలు, సన్మానాలు, బిరుదులూ అందుకున్నారు .
దాశరధి రంగాచార్య రచనలు

  • శ్రీమదాంధ్ర ఋగ్వేద సంహిత - నాలుగు వేద సంహితలు - ఆరు భాగాలు 
  • శ్రీ మదాంధ్ర వచన   శుక్ల యజుర్వేద సంహిత,
  • శ్రీ మదాంధ్ర వచన సామ వేద సంహిత ,
  • శ్రీ మదాంధ్ర వచన అధర్వవేద సంహిత
  • శ్రీ మదాంధ్ర సాంఖాయన  శాంఖాయన  బ్రాహ్మణము
  • శ్రీ మదాంధ్ర వచన ఐతరేయ బ్రాహ్మణము మొదలైనవి..... 
  • తొమ్మిది ఉపనిషత్తులు, 
  • శ్రీ మద్రామాయణము, 
  • శ్రీ మహా భరతం, 
  • శ్రీ మద్భగవత్ గీత, 
  • శ్రీ మద్భాగవతము, 
  • సీతా చరితం, 
  • వేదం జీవన నాదం - ప్రవేశిక, 
  • వేదం జీవన నాదం - ఋగ్వేద పరిచయం, మొదలైన  గ్రంధాలతో పాటు 
  • ఆధునిక సాహిత్యం 
  • చిల్లర దేవుళ్ళు, ఘాట్ గా దేవత, (హింది) మోదుగు పూలు, జానపదం, రానున్నది ఏది నిజం మాయా జలతారు, సరతల్పం, మానవత, పావని, జాన పదం, అమృతం గమయ ... మొదలైన నవలలు..... 
  • ఆత్మా కధలు :  జీవన యానం - జీవితం, యాత్రా జీవనం - యాత్రలు,
  • కధలు :నల్ల నాగు - సంపుటి, రణ రంగం, కెరటాలు,
  • దేవదాసు ఉత్తరాలు, 
  • కవితా కాదంబరి మానస కవిత, 
  • ఉర్దూ మాదిర ఇక్బాల్ కవిత, జవుఖ్ కవిత మొదలైనవి. 
  • ఇవి కొన్ని మాత్రమే.... ఇంకా చాలా సాహితీ రచనలు వున్నాయి.              

ఉద్యమకారుని నుంచి అధ్యాత్మిక వేత్తగా మారి మానవాళికి అంతులేని విఙ్ఞాన సంపద నొసగిన డా.దాశరధి రంగా చర్య గారి కి నివాళులు అర్పిస్తూ ఈ చిన్ని అక్షరాంజలి.