మహావీరుడు మహిళల కోసం ప్రవేశ పెట్టిన సంస్కరణలు
ఈ రోజు జైన్ మహావీరుడు జయంతి (23 04 2013)
ఈ సందర్భంగా వారి గురించి కొన్ని విషయాలు.
భగవాన్ మహావీరుడు జైన మత గురువు. తమ ఆర్ధ్య దైవంగా భావించే జైనులు స్త్రీలు పురుషులు సమానంగానే పూజిస్తారు. సాధారణం గా ఎన్నో నియమాలు పధతులు వున్నా తమ జీవన సాఫల్యం కోసం, జీవన్ ముక్తి కోసం జీవిస్తారు. మహిళలు ఎంతో మంది వీరి శిష్యులుగా వున్నారు. మహిళ లు సమాజం లో వారి స్థానం , వారి విధులు విధానాలు అన్ని సంప్రదాయానుసారం పాటిస్తారు. మహిళల అభివృధి కోసం జైన మతం ఎంతో పాటు పడుతోంది. వీరి సమాజంలో మహిళలు ఎలా వుండేవారు , మహావీరుడు వారి అభివ్రుది కోసం చేసిన మంచి పనులు, ప్రముఖులైన మహిళలు ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు మహా వీరుని గురించి తెలుసుకుంటే బాగుంటుంది.
వర్ధమాన మహావీరుడు జైన మాత స్థాపకులలో ముఖ్యులు. జిన అంటే విజేత అనే పదం నుంచి జైనం వచ్చింది. జీవన ప్రవాహాన్ని దాటడానికి వారధి నిర్మించిన వారు. జైన గ్రంధాలలో వీర, వీర ప్రభు, సన్మతి, అతివీర, జ్ఞానపుత్ర వంటి పేర్లు కనిపిస్తాయి వర్ధమానుడు ఇరవై నాలుగవ తీర్థంకరుడు (జినుడు ). చివరి తీర్థంకరుడు కూడా! జైన మతం అతి ప్రాచీనమైన మతం. మొదటి తీర్థంకరుడు వృషభనాధుడు. 23వ తీర్ధంకరుడు పార్శ్వ నాధుడు. ఇంతకు ముందు వున్నా తీర్థంకరులు కూడా జైన మతాన్ని ప్రచారం చేశారు కాని మహావీరుడి కాలం లో అది ఎక్కువగా ప్రాచుర్యం లోకి వచ్చింది. జైన మతాన్ని శ్రమణ మతమని కూడా అంటారు.
మహావీరుడు 599లో కుంద గ్రామం వైశాలి లో రాజవంశంలో జన్మించాడు. తండ్రి సిద్ధార్ధుడు . తల్లి యశోధర. వీరిది జ్ఞాతృ వంశం. నిర్గంధ సంప్రదాయం అంటే గ్రంధిరహితమైన లేదా బంధవిముక్త అని అర్ధం అందుకే మహావీరునికి నిగంధనాత పుత్త అనే పేరు కూడా వుంది. భార్య త్రిశల. ప్రియదర్సి అనే పుత్రిక, అల్లుడు జామాలి. ఇతను మహావీరుని మొదటి శిష్యుడు.
మహావీరుని 28వ సంవత్సరంలో తల్లి తండ్రి మరణించారు. కొంతకాలం అక్కడే వుండి తన ముఫై ఏళ్ల వయసులో ఇలు వదిలి వెళ్ళాడు. తన ఆస్తిని తనకి సంబంధించిన అన్ని వస్తువులు యీదలకు దానం చేశారు. అడవి ప్రాంతాలలో పాదరక్షలు ధరించకుండా నడిచేవారు. పూర్తి సన్యాసి జీవితాన్ని గడిపేవారు. అక్కడ ఎవరితోనూ మాట్లాడేవాడు కారు. మౌనాన్ని పాటించేవారు. కాలి నడకన కొత్త కొత్త ప్రదెశాలు తిరిగేవారు. ఉపవాస దీక్ష పాటించేవారు. అడవుల్లో వుండే గిరిజనులు తరచూ ఆట పట్టిస్తూ వేదిస్తూ ఉండేవారు. అయినా ఎప్పుడు పట్టించుకునేవాడు కాదు. కఠినమైన తపస్సు చేశారు.
సత్యాన్వేషియై తిరిగిన ఆ మహావీరుడు పన్నెండేళ్ళు తపస్సు చేసారు. శరీరం సుస్కించి పోయింది వైశాఖమాసం పదమూడవ రోజున జృమ్బిక గ్రామంలో అతనికి జ్ఞానోదయం (అంతర్ బుద్ది ) కలిగింది. మొదటిసారిగా ఒక బానిస అయిన చందన అనే మహిళ చేతి భోజనం చెసారు. ఉత్తర భారత దేశం అంతటా తన జైత్ర యాత్ర చెసారు . కాలినడకనే తన తత్వాన్ని అంగ మిధిల, కోసల, మగధ దేశాలలో ప్రచారం చేశారు. బీహార్, జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ఒరిస్సా వంటి ప్రదేశాలు పర్యటించాడు. జైన సంప్రదాయం లో మనిషి జీవన విధానం, వాటిని పాటించే తీరు చాల సులభంగానే వుండేది. జంతు బలులపై తన నిరసనని నిశ్శబ్దంగ తెలిపెవాడు. మహా వీరుని బోధనలు విద్యా వేత్తలు, పండితులు, పేద గొప్ప, స్త్రీలు పురుషులు , రాజులూ రాణులు ఇలా ప్రతి ఒక్కరిని ఆకర్షించేవి. ఇతని వెంట చాలా మంది నడిచారు. బింబిసారుడు కూడా ఇతని శిష్యుడే! తనలోని కర్మలని జయించిన నాడు ప్రతి వ్యక్తీ కూడా దేవుడే! ఎక్కడో వుండే దేవుని శోధించే కంటే మానవత్వం లో వుండే దేవుని చూడమనే వాడు.
తన 43వ ఏట సాల వృక్షం కింద తప: సిద్ది పొందాడు. జైన మతానుసారం సమ్యక్ దర్సనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ జీవనం అనే మోక్ష మార్గాలని త్రిరత్నాలు అని అంటారు . అహింస, సత్యం, అపరిగ్రహం, అస్తేయం, బ్రహ్మ చర్యం అనే వాటిని పంచ వ్రతాలు అంటారు. బ్రహ్మ చర్యం పాటిస్తూ హింస చేయకుండా, అబద్ధ మాడకుండా, ఇతరుల ఆస్తిని కబళించకుండా, దొంగతనం చేయకుండా, వుండాలి వీటిని పాటిస్తూ త్రి రత్నాలతో జీవించే వారికి కైవల్యం లభిస్తుందని మహావీరుడు బోధించే వాడు .
సన్యాసి అయిన వాడు శాకాహారాన్ని తీసుకొవాలి. అహింసను తప్పనిసరిగా పాటించాలి. ప్రతి ప్రాణికి, వస్తువుకి కాని, అజీవులు అయిన వాటికి కాని చైతన్యం వుంటుందని వాటికి గాయాలైతే అవి బాధ పడతాయని అంటారు. చివరికి భూమిలో వుండే వాన పాములు చనిపోతాయని భూమినే దున్నద్దు అని అన్నారు . అందుకే చాలామంది జైనులు వ్యాపారాలలో స్థిర పడ్డారు. గాలి పీలిస్తే గాల్లోని సూక్ష్మజీవులు చచ్చి పోతాయని మూతికి గుడ్డ కట్టుకుని తాగుతారు. నీళ్ళు వడకట్టుకుని తాగుతారు. అడుగు తీసి అడుగు వేసేటప్పుడు కాలి కింద పడి సూక్ష్మ జీవులు చచ్చిపోతాయని నెమలీకలతో చేసిన పొరకతో నడిచినంతమెర అడుగేసే ముందు నేలను ఊడుస్తారు. నేల కింద పండే దుంప కూరలు, ఉల్లి వెల్లుల్లి మసూర్ గింజలు వంటివి కూడా తినరు.
తన డెభై రెండవ ఏట మహావీరుడు పావా జిల్లాలో నిర్యాణం పొందాడు. జైన మతంలో శ్వేతాంబరులు దిగంబరులు అని రెండు తెగలుగా గా వుండే సన్యాసుల మధ్య తేడాలు లెవు. కాని నిర్యాణం పొందటానికి నగ్నత్వం ముఖ్యం అని దిగంబరులు, కాదని స్వేతంబరులు భావించేవారు . స్త్రీలకూ విముక్తి లేదన్నారు కాని స్వేతంబరులలో 19వ తీర్ధంకరుడైన మల్లి నాదులు స్త్రీలకూ విముక్తి వుందన్నారు . దేవాలయాలలో విగ్రహ పూజ దిగంబరులు చేస్తే శ్వేతాంబరులు పవిత్ర స్తానకాలలో వుండి జైన గ్రంధ బోధనలు చెబుతారు. కొంతమంది మాత్రం విగ్రహ పూజ కూడా చేస్తారు మహావీరుని, తీర్ధంకరులను ఆలయాలలో దిగంబరులు పూజిస్తే శ్వేతాంబరులు స్థానకాలలొ వుంటూ ఒక చోటునుంచి ఇంకో చోటుకు కాళీ నడకన వెళ్లి బిక్ష స్వీకరిస్తారు.
మహిళలు కూడా జైనమతం లో వున్న అన్నిటిని సంప్రదాయాలు పాటిస్తారు. పంచ సూత్రాలు వీరు కూడా పాటిస్తారు. స్త్రీ పురుషులు ఒకరికొకరు సాయ పడటం, మానవత్వం విషయం లోను, పర్యావరణాన్ని రక్షించటం లోను వీరు కూడా పాల్గొనవచ్చు. ఇరువురు సమానమే!
మహావీరుని ఆద్యాత్మిక బోధనలు మహిళలని ఎంతో ఆకర్షించేవి . చాలా మంది స్త్రీలు వీరి శిష్యులుగా మారారు. అంతిమ అనందం, సత్యం వెతుకులాటలో ఎంతో మంది మహిళలు కూడా చేరారు. మహావీరుడు తన అనుచరులని నాలుగు తరగతులుగా (కేటగిరీలుగా) చేసారు. సాధుస్, సాద్విస్, శ్రావక్స్, స్రావికాస్. ఈ క్రమాన్ని జైన్ సంఘంగా పిలిచేవారు. జైన సాధువులను నేడు కూడా శ్రమణులనే పిలుస్తారు. వీరి సంప్రదాయానికి జైనం అని పేరు వున్నా మహావీరుని కాలంలో దీనికి నిర్గ్రంధం అని నిర్గ్రంద ప్రవచనం అని పిలిచేవారు. పార్శ్వనాధుని సమయంలో శ్రమణ ధర్మం అనే పేరు వుంది. ఈ జైన సంప్రదాయానికి మూలమైన సిదాంతాన్ని ఆత్మ వాదమని అనేకాంత వాదమని అంటారు. బాహ్య భ్యం తరములైన వికారాలను అంటే క్రోధం, కామం, ఈర్ష్య, అసూయ మొదలైన వాటిని జయించిన వానికి జిన, జినుడు అని పేరు.
భగవాన్ మహావీరుని బోధనలు అంగాంగ సూత్రాలుగా వర్ణించే వీటిని 12 గ్రంధాలుగా అతని శిష్యులు రచించారు. జైన్ సంప్రదాయాలని వివరిస్తూ వుండే వీటిని అగమ్ సూత్రాలు అని అంటారు. ముందు ఈ సూత్రాలు బోధనల ద్వారా మాత్రమే ప్రచారం అయ్యెవి. వెయ్యి సంవత్సరాల తరువాత వాటిని ముందు తరాల కోసం తాళ పత్ర గ్రందాల మీద రచించారు.
మారుతున్న కాలంతో పాటు జైనిజంలో మార్పు వచ్చి స్త్రీ పురుషులిరువురు తమ పిల్లలు కుటుంబ సంక్షేమం కోసం, జైనమత సంప్రదాయాన్ని సమానంగానే రక్షించారు. పూర్వం లో మాదిరి గానే సన్యాసినులు గా కూడా మహిళలు జీవించవచ్చు. మహావీరుని సిద్దాంతాల పట్ల అనేక మంది మహిళలు ఆకర్షితులై ప్రపంచంలో ఆనంద లబ్ది కై వీరి వెంట నడిచారు . శ్రావకిలుగా ఎంతో మంది మహిళలు వున్నారు.
జైన్ మత సాధువులు సాధ్విమణులు తప్పక ప్రత్యేకంగా తాయారు చేసిన ధవళ వస్త్రాలు మాత్రమే ధరించాలి. వారి ఐదు సూత్రాలను తప్పక పాటించాలి. సూర్యోదయానికి ముందు సూర్య్దయం తరువాత తప్పనిసరిగా రోజుకు రెండుసార్లు అవస్యక్ చేయాలి. సాద్విస్ తమకి తామే అన్ని పనులు చేసుకోవాలి. ఇతరుల సాయం తీసుకోరాదు. తప్పని పరిస్తితుల్లో తోటి సాద్విస్ సాయం మాత్రం తీసుకోవచ్చు. తమ ఆహారాన్ని వండుకోగూడదు. ఇంటింటికి వెళ్లి తమకి కావలసిన కొద్ది ఆహారం నీరు మాత్రం తెచ్చు కోవాలి. అందరు నిజాయితీ తో క్రమబద్దమైన జీవితాన్ని గడపాలి నలుగురికి ఆదర్శం కావాలి.
దిగంబర శాఖకు చెందిన వారు పురుషుల కంటే మహిళలను తక్కువగా భావిస్తారు. కొన్ని చోట్ల మహిళలని పవిత్రులు కాదని, సమానులు కాదని కూడా అంటారు. శారీరకంగా ప్రతి నెలా వారికి సంభవించే రుతు కార్యక్రమం వల్ల వాళ్ళు సమానం కాదని అంటారు.అంతే కాదు వారు ఈ ప్రాపంచిక విషయాలనుంచి విముక్తి పొందాలంటే మళ్లి వీరు పురుష జన్మ ఎత్తాలి అని కుడా అంటారు. కాని శ్వేతాంబరులు మహిళలకి సమన హోదా కల్పిస్తుంటారు.
19వ తీర్ధంకరుడు అయిన మల్లి నాధుడు పురుశుడని దిగంబరులు భావిస్తే శ్వేతాంబరులు స్త్రీ అయిన మల్లి కుమారి అని అంటారు. వారి గ్రంధాలలో మల్లి కుమారి జీవిత కథ కూడా వుంది. రేవతి, బ్రాహ్మి , సుందరి, సాద్విమణులైన పుష్పచుల (pushpachula ), రుద్రసోమ , రుక్మిణి, ఋషి దత్త, ఇలా ఎందరో మహిళలు జైన మతాన్ని అనుసరించి సాద్విమణులుగా పేరు పొందారు.
ఎంతో మంది పురుషులు స్త్రీలచే ప్రభావితులయ్యారు హేమచంద్రాచార్యులు తన తల్లి పాహిమి వల్ల జ్ఞాన సముద్రులు అని పేరు పొందారు . అలాగే కవి అయిన ధనపాల్ తన సోదరి సుందరి ప్రోత్సాహం వాళ్ళ గ్రంధం అమరకోశం రచించారు. శ్రీదేవి, అనుపమ దేవి వంటి కూడా తమ భర్తలు ఆధ్యాతిమిక, వ్యాపార రంగాల్లో వృద్ది చెందటానికి తోడ్పడ్డారు . ఈ తరంలో కూడా ఎంతో మంది సాద్విమణులు శ్రావిక లు కుడా ప్రసిద్ది పొందిన వారున్నారు. మహాసతి ఉజ్వలకుమారి వ్యక్తిత్వం తెలిసి మహాత్మా గాంధీయే స్వయంగా వెళ్లి ఆమెని కలిసారు. హర్కున్వర్ జెఠాణి హతి సిన్హా ఎన్నో ఆలయాలు కట్టించారు. ఎందఱో మహిళా మణులు ప్రసిద్ది చెందిన వారున్నారు. మహావీరుని జైన మతాన్ని అనుసరించిన మహిళలు సాధు మనస్త్వం కలిగిన వారు గా వుంటారు. అహింసని ఐదు ధర్మాలలో ఒకటిగా పాటించే వీరు సతి సహగమనాన్ని వ్యతిరెకిస్తారు. మహిళలని బానిసలుగా వ్యాపారం చేసే పద్ధతిని, దాసీ విధానాన్ని వ్యతిరేకిస్తారు. ఆ రోజుల్లో రాజైన మేఘ కుమార్ సంతోషం కోసం అనేక మంది స్త్రీలను బానిసలుగా వివిధ దేశాల నుంచి తీసుకు వచ్చేవారు . భగవాన్ మహావీరుడు ఈ రకమైన బానిస విధానాన్ని చాల గట్టిగా వ్యతిరేకించే వారు.
ఆనాటి సమాజంలో వుండే జంతు బలులని నిషేధించటానికి సాధ్వి వక్షకున్వర్జి ఎంతో కష్ట పడవలసి వచ్చింది. బహు భార్యత్వం, మత్తు పదార్ధాలు సేవించటం, జూదం వంటి చెడు వ్యసనాలు వున్న సమాజం లో స్త్రీలు ఎంతో హింసకి గురయ్యెవారు. వారిని రక్షించే వాళ్ళు.
మహావీరుడు స్త్రీ పురుషులిరువు సమానమే అని అనెవారు. మహావీరుడు నిర్యాణం చెంది 2612 సంవత్సరాలు అయినా నేటికి వారు చిరంజీవియే! దేశమంతా వారి పీరు మీద మహిళా విద్యాలయాలు, ఆసుపత్రులు సంక్షేమ పధకాలు ఎన్నో వెలిసాయి. వీరి సంప్రదాయాన్ని జిన మతస్తులందరు ఎంతో నిష్టగా పాటిస్తారు. ఉపవాస దీక్షలు చేస్తారు. దాన గుణం వీరి లో ఎక్కువగా కనపడుతుంది. విద్య , వైద్య, వ్యాపార , ఇండస్త్రీ రంగాల్లో ప్రవేసించి దేశానికి ఎంతో సేవ చేస్తున్నారు.
జైనులు మహావీరుని అహింస జీవించు ఇతరుల జీవించు సిద్దాంతం నేటి సమాజంలో ఇప్పటికి పాటిస్తున్నారు.
మహావీరుడు స్త్రీలు తమకి ఇష్టం లేని వివాహ జీవితాన్ని వద్దు అని తెలిపే హక్కు వుందని వారు ఇష్ట పాడితే సన్యాసిని గా జీవించ వచ్చని అనేవారు. స్త్రీలకి భావ స్వేచ్ఛని ఇచ్చారు. జైన మతం లో స్త్రీల పాత్ర ఎంతో ఉన్నతంగా చిత్రించ బడింది తీర్ధంకరులకి మాతృ మూర్తులుగా, భర్తలకి స్పూర్తినిచ్చే భార్యలుగా, తమ వ్యక్తిత్వంతో వ్యాపార రంగం లో వున్నత శిఖరాలకి చేరుకున్న మహిళలు వున్నారు. ఆమె వ్యక్తిత్వం ఎక్కడికి వెళ్ళిన గౌరవించ బడుతుంది. స్వాద్విమణులు, స్రామిక్ లు సమాజం శ్రేయస్సుకోసం ఆధ్యాత్మికం గా తమ ధ్యేయాన్ని చేరుకుంటారు.