Search

Saturday, October 10, 2015



మాతృగయ లోనే  నిర్వహించే శ్రాద్ద కర్మలు 
మాతృమూర్తులకు  - మోక్ష ప్రసాదం 
సిద్దపూర్ , గుజరాత్







కపిల మహర్షి ఆలయం 
 







        మేము ఇటీవల  ద్వారక, సోమనాథ్ వెళ్ళాము.  ఎంతో ఆహ్లాదకరంగా సాగిన మా యాత్ర విశేషాలు గురించి నలుగురితో పంచుకోవాలనిపించింది. హైదరాబాద్ నుంచి ఒక గంట ప్రయాణం విమానం లో చేసి అహ్మదాబాద్  చేరుకున్నాము. అహ్మదాబాద్  ఏర్ పోర్ట్ నుంచి ట్రావలర్ వెహికల్ లో 12 మందిమి మాతృగయ చేరుకున్నాము. సిద్దపూర్ గుజరాత్ రాష్ట్రం లో ఉత్తరాన పాటన్ (Patan)జిల్లాలో వుంది. గుజరాత్ లో వున్న సిద్ద్ పూర్ నే మాతృ గయ అంటారు. మాతృగయ చాలా విశేషవంతమైన ప్రదేశం. ఇక్కడ గంగ సరస్వతి నదుల సంగమ ప్రదేశం వుంది.  సిద్ద్ పుర్ పవిత్రమైన స్థలమని శ్రీ స్థల్ అని భావిస్తారు.  పురాణాల కాలం నుంచి ఈ ప్రదేశ గురించిన ప్రస్తావన వుంది.  పురాణాల ప్రకారం దధీచి మహర్షి తన అస్తికలను ఇంద్రుడికి సమర్పించిన ప్రదేశంగా కూడా చెబుతారు.  పాండవులు   ఇక్కడికి వచ్చినట్లు చెబుతారు. ఋగ్వేదం లోను దీని ప్రస్తావన వుంది
స్థల పురాణం :
         బ్రహ్మ మానస పుత్రుడైన కర్దమ మహర్షి కి మనువు పుత్రిక దేవహుతికి వివాహం జరిగిన చోటు ఇదే అంటారు. . వీరికి తొమ్మిది మంది పుత్రికలు. వీరిని తొమ్మిదిమంది మహర్షులకి ఇచ్చి వివాహం చేశారు. వీరి పుత్రికలలో అనసూయ కూడా వుంది. అంతేకాదు ఈ దంపతులు చాలా కాలం తపస్సు చేసి విష్ణుమూర్తి చే భగవంతుడే తమ పుత్రుడిగా జన్మించాలని వరం పొందుతారు. ఆ పుత్రుడే భగవంతుడి అవతారమైన కపిల మహర్షి. పదహారేళ్ళ వయసులో కపిల మహర్షి తన తల్లికి వివరించిన సంఖ్యా శాస్త్ర సూత్రాలే కపిల గీత! గా ప్రసిద్ది చెందింది. తండ్రి కర్దమ ప్రజాపతి తన భోగ ఉపకరణాలు, సంపద అన్నీ వదిలి తపస్సు చేసుకోవడానికి వెళ్లి పోతాడు. దేవహుతి కుడా తన భర్త లేని ఈ సంపద భోగ వస్తువులు తనకి వలదనుకుని వైరాగ్యం తో కపిలుని వద్దకు వెళ్లి తను కూడా ఏమి చేస్తే మోక్షం పొంద గలనని వివరించమని అడుగుతుంది. అప్పుడు తల్లికి వివరించిన గీతోపదేశమే కపిల గీత .
పరశురాముడు 

తల్లి మరణానంతరం కపిలుడు తల్లి  శ్రాద్ధ కర్మలు ఇక్కడే నిర్వహించాడు. అందుకే ఇది మాతృగయ గా ప్రసిద్ది చెందింది. ఇక్కడే పరశురాముడు కుడా తన తల్లి శ్రాద్ధ కర్మలు నిర్వహించాడు. తల్లికి పెట్టే పిండ ప్రదానాలలో  దాదాపు 20 చిన్న చిన్న పిండాలు పెడతారు . ఎందుకంటే పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయ్యేంత   వరకు, జీవితాన్ని ఇచ్చిన  తమ తల్లికి  కృతజ్ఞతగా ఇన్ని పిండాలు పెట్టిస్తారు. కొంతమంది 27 పిండాలు పెట్టిస్తారు. తెలిసి తెలియక తమ తల్లిని బాధ పెట్టినందుకు అంటే నవమాసాలు మోసినందుకు, కన్నందుకు, అన్నం తిననని మారం చేసినపుడు  చదువు కునేటప్పుడు,  ఇంకా అనేక విధాలుగా తాను చేసిన తప్పులు క్షమించినందుకు, కృతఙ్ఞతలు చెబుతూ పిండాలు సమర్పిస్తారు. తల్లికి మాత్రమె నిర్వహించే శ్రాద్ధకర్మలు నిర్వహించే ప్రదేశం ఇది ఒక్కటే!   తమ తల్లికి పిండ ప్రదానం ఇక్కడ చేస్తే తల్లికి మోక్షం కలుగుతుందని అందరు నమ్ముతారు. మన సంప్రదాయం  ప్రకారం పుత్రులు మాత్రమే తల్లికి కర్మకాండలు నిర్వహిస్తారు.  చుట్టూ పక్కల కాని ఇక్కడ కొంతమంది స్త్రీలు కూడా తమ తల్లికి పిండ ప్రదానాలు చేస్తుంటారు.
బిందు సరోవరం:

                                   


మన భారత దేశం లో వున్న 5 పవిత్రమైన సరోవరాల్లో గుజరాత్ లోని  బిందు సరోవరం ఒకటి. మిగిలిన నాలుగు సరోవరాలు టిబెట్ లోని మానస సరోవరం , రాజస్తాన్ లోని పుష్కర్ సరోవరం, కచ్ (గుజరాత్)లోని నారాయణ సరోవరం,  కర్ణాటక లోని పద్మ సరోవరం. భగవంతుడు ప్రత్యక్షమైనపుడు దేవహుతి కనుల వెంట జారిన ఆనందాశ్రవులే  బిందు సరోవరం గా మారింది అని, మరి కొంతమంది కపిలుడు బోధించిన గీత వల్ల ఆనందంతో రాలిన బిందువులే బిందు సరోవరం అని అంటారు. ప్రస్తుతం అక్కడి నీరు అపరిశుభ్రం గా వుంది.  ఈ ఆలయాల కి పక్కనే అదే ప్రాంగణం లో  గుప్త సరోవర్ అని పెద్దది వుంది. విశాలమైన ఆ తటాకం లో నీరు కూడా ఆకుపచ్చగా వుంది. అక్కడే వున్న అశ్వద్ద వృక్షంలో  శ్రాద్ధ  కర్మలు చేసిన  వారిచే  మంత్రాలూ చెబుతూ ఒక చెంబుతో  నీళ్ళు పోయించారు అక్కడి బ్రాహ్మలు.  దీని significance  తెలీదు కాని అందరు తమకి తోచిన దక్షిణ సమర్పించారు.
ముక్తి ధామ్:
ముక్తి ధామ్ గా పిలిచే ఈ  సిద్దాపూర్ గ్రామానికి చుట్టుపక్కల 85 గ్రామాల ప్రజలలో ఎవరు మరణించినా ఇక్కడికి వచ్చి వారికి అగ్ని సంస్కారాలు చేస్తారు. ఇక్కడ అంతిమ సంస్కారాలు నిర్వహిస్తే వారికి మోక్షం లభిస్తుందని నమ్మకం. మరణించిన వారి అస్తికలను సరస్వతి నదిలో కలుపుతారు.    అలాగే  చివరి కర్మకాండలు నిర్వహించి మరణించిన వారికి ముక్తి ప్రసాదించమని వేడుకుంటారు.  ప్రతి ఏటా వేలాదిమంది తమ మాతృ మూర్తులకు శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు. గంధర్వ స్మశానం అని కుడా పిలుస్తారు ఇక్కడి స్మశానాన్ని. ఉజ్జయిన్, కాశీ, ప్రయాగ లలో కూడా ఇటువంటి ముక్తి ధామ్ వుంది.
రవాణా సౌకర్యాలు: సిద్ద్ పుర్ అహ్మదాబాద్ కి 114 కి.మీ, దూరం లో వుంది. ముంబై నుంచి ఆరావళి ఎక్స్ ప్రెస్, ఇతర ప్రదేశాలు ఓకా , డెహ్రాడున్, బెంగళూరు, మొదలైన ప్రధాన నగరాల నుంచి కూడా రైళ్ళు వున్నాయి. విశేషమైన చరిత్ర కలిగిన సిద్దపూర్ లో అక్కడ వున్నఉత్తరాధి మఠ్ లో అందరు (మగవారు మాత్రమే) తమ మాతృమూర్తులకి పిండ ప్రదానాలు  చేశాక  అక్కడే భోజనాలు ముగించాము. బిందు సరోవరానికి చుట్టూ   కపిల, దేవహుతి, కర్దమ మహర్షి శివ, పార్వతి, గణపతి   మొదలైన ఆలయాలు వున్నాయి. 

గణపతి ఆలయం మాతృ గయ


ఈ  ఆలయాలు కాక దగ్గరలోనే సత్యనారాయణ మందిరం, శ్రీకృష్ణ ఆలయం, బాలాజీ మందిరం, ఇంకా ఎన్నో చిన్న చిన్న ఆలయాలు 
వున్నాయి....

బిందు సరోవరానికి వెళ్ళే దారిలో వున్న మురళి మనోహరుని మందిరం,




మురళి మనోహరుని ఆలయం


బాలాజీ మందిరం 
                                                                   బాలాజీ మందిరం 
బిందు సరోవరం ప్రాంగణం లోని ఆలయ సమూహాల ముందు  మేమిద్దరం 

.

Friday, October 9, 2015

శ్రీ గురు దత్తాత్రేయ ఆలయం, మాహుర్, మహారాష్ట్ర

 శ్రీ గురు దత్తాత్రేయ ఆలయం
(మాహుర్,  మహారాష్ట్ర)
!!జై గురుదత్త! శ్రీ గురుదత్త!!
శ్రీ గురు  దత్తాత్రేయ ఆలయం,  మాహుర్  మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా లో వుంది."శ్రీ గురు దత్తాత్రేయ  చరిత్ర"లో మాహుర్ గురించి దాని ప్రాముఖ్యత గురించి విపులంగా చెప్పారు. దత్త పారాయణ చేసే భక్తులకు  ఈ క్షేత్ర మహిమ గురించి ఎక్కువగా తెలుస్తుంది. వారికోసం   మాహుర్ శ్రీ దత్తాత్రేయ ఆలయవిశేషాలు....
 

దత్తావతారం :

త్రిమూర్తు లైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి అవతరించిన దత్తాత్రేయుడు మాహుర్ ఘడ్ లో నిద్రించే వాడని ప్రసిద్ది.   అత్రి, అనసూయల కుమారుడు  దత్తత్రెయుడు దత్త అంటే దత్తత వెళ్ళడం. అత్త్రేయ అంటే అత్రి మహర్షి.

దత్తాత్రేయ అంటే అత్రి, అనసూయ మాతలకు దత్త పుత్రుడు . త్రిమూర్తులు ఈ దంపతులకు పుత్రుడి రూపం లో  తమని తాము సమర్పించుకున్నారు కాబట్టి దత్తత్రేయుడయ్యాడు.   అనసూయా మాత పాతివ్రత్యానికి మెచ్చి త్రిమూర్తులు ఇచ్చిన  కోరిక ప్రకారము త్రిమూర్తులు వారికి    దుర్వాసుడు, చంద్రుడు, దత్తాత్రేయుడు అనే ముగ్గురు పుత్రులుగా జన్మిస్తారు.. దత్తాత్రేయుడు అంటే విష్ణు మూర్తి అవతారంగా భావిస్తారు.  కొంత కాలం  ముగ్గురూ అత్రి దంపతుల వద్ద పెరిగిన అనంతరం బ్రహ్మ అవతారమైన చంద్రుడు, శివుని అవతారమైన దూర్వాసుడు తమ అంశాలను దత్తునిలో లీనం చేసి దుర్వాసుడు తపస్సుకు, చంద్రుడు తన స్తానానికి వెడలినపుడు దత్తాత్రేయుడు ఆ ముగ్గురి అంశాలతో దత్తాత్రేయుడు భాసిల్లాడు.

మార్గశిర పూర్ణిమ దత్తాత్రేయులు అవతరించిన రొజు. దీనిని దత్త జయంతిగా జరుపుకుంటారు. ఈ రోజునే కొన్ని చోట్ల కోర్ల పండగ అని, కుక్కల పండగ అని జరుపుకుంటారు. దేవ్దేస్వర్ (Devdeswar) ఆలయం మాహుర్  లో వుంది. ఇది దత్తుడు నిద్రించే  ప్రదేశం.

దత్తుని దినచర్య :

శ్రీ గురు దత్తాత్రేయుడు కాశీలోని గంగ లో స్నానం చేసి,  కొల్హాపూర్ లో బిక్ష స్వీకరించి, మాహుర్ లో నిద్రించే వాడుట. ఇప్పటికీ దత్తుడు ప్రతి రోజు ఇక్కడికి వచ్చ నిద్ర చేస్తాడని భక్తుల విశ్వాసం.  మాతృ తీర్ధం లో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం.

మరికొంత మంది దత్తాత్రేయుడు కొల్హాపురి లో బిక్ష తీసుకుని పంచలేశ్వర్ లో భోజనం చేసేవాడని, మాహుర్ లో విశ్రాంతి తీసుకునే వాడని  కూడా అంటారు. ఈ పంచలేస్వర్ పర్లి వైద్యనాధ్ జ్యోతిర్లింగాల దగ్గర వుంది.  ఔరంగాబాద్ కి వెళ్ళే దారిలో  శనేశ్వర్  ఆలయానికీ దగ్గరలో వుంది ఈ పంచలేశ్వర్  ఆలయం.

మాహుర్ లో చూడవలసిన ప్రదేశాలు :

* అలాగే ఇక్కడ వున్న మాతృ తీర్థం, సర్వ తీర్థం ఒకటే  నని కొందరు అంటారు. దత్తాత్రేయుడు ఈ తీర్థాన్ని సృష్టించాడని,  పరశురాముడు తన తల్లితండ్రులైన   జమదగ్ని, రేణుకల  కర్మ కాండలు ఇక్కడ నిర్వహించాడని పురాణాలు చెబుతున్నాయి.మాహుర్ మాతృ పట్టణం, మయూర క్షేత్రం గా ప్రసిద్ది చెందింది. మాహుర్ పర్వత శ్రేణులలో మూడు కొండలపై మూడు అలయాలున్నాయి.  రేణుకా దేవి ఆలయం ఒక కొండ మీద, దత్తాత్రేయుని ఆలయం ఒక కొండ మీద, అత్రి, అనసూయ మాతల ఆలయం ఒక కొండ మీద వున్నాయి. ప్రైవేట్ వాహనాలు  దత్తాత్రేయుని ఆలయం వరకు వెళ్ళచ్చు.  రేణుకాదేవి ఆలయానికి,  అనసూయ మాత ఆలయానికి మాత్రం కొండ ఎక్కాల్సిందే! 

మాహుర్ లో పెన్ గంగా నది ప్రవహిస్తుంటుంది.  మాహుర్ లో చూడవలసినవి రేణుకాదేవి ఆలయం , పరుశురామ ఆలయం, మాహుర్ కోట, మ్యుజియం,   మాహుర్ తీర్థం,  ముఖ్యమైనవి.మాహుర్ పట్టణానికి 19 కిలోమీటర్ల  దగ్గరలో శక్తిపిఠమ్ గా చెప్పబడే ఏకవీరా దేవి కుడా వుంది. ఇక్కడ సతీ దేవి కుడి భుజం పడినట్లు గా అక్కడి స్థలపురాణం చెబుతోంది. ఎక్కువగా భక్తులు రేణుకా దేవి ఆలయానికి వస్తుంటారు.మాహుర్ కోట చాల పెద్దది. రేణుకా మాత ఆలయానికి ఎదురుగా ఉన్న కొండ మీద 15వ శతాబ్దం లో నిర్మించారు.

ఇక్కడికి చేరుకోవాలంటే...:

మహారాష్ట్ర ప్రభుత్వం నాందేడ్, కిన్వత్, యావత్మల్,నుంచి మాహుర్ కి బస్సు లు నడుపుతోంది. నాందేడ్ వరకు రైల్ మార్గం కుడా వుంది. అక్కడినుంచి రోడ్డు మార్గం ద్వారానే మాహుర్ లోని ఆలయాలు చేరుకోవాలి.  ఆలయానికి 7 కిలోమీటర్ల దూరం లో వున్న మాహుర్ పట్టణం లో వసతి సదుపాయం వుంది.

మాహుర్ దత్తాత్రేయ ఆలయంలో   దత్త పూర్ణిమ నాడు విశేష మైన పూజలు చెస్తారు. మహా ప్రసాదం అందరికి పంచుతారు. దట్టమైన అడవులలో కొండ మీద నెలకొన్న ఈ ఆలయ దర్శనానికి భక్తులు ఎక్కువగానే వస్తుంటారు. మహారాష్ట్ర నుంచి అంధ్రా నుంచి భక్తులు వస్తుంటారు.