Search

Sunday, August 14, 2016


ఈ రోజు  ప్రముఖ నటి రాజసులోచన  జయంతి.
వారు  5, మార్చ్, 2013 లో  మరణించారు.
వారిని  ఇంటర్వ్యూ తీసుకున్న  నాటి   విశేషాలు,  జీవన విశేషాలు  ఈ  పోస్ట్ లో..

యన్.టి.ఆర్ అవార్డు గ్రహీత రాజసులోచన గారితో ఒక ఇంటర్‌వ్యూ

By కె, మణినాథ్

అలనాటి చలన చిత్ర సీమకురాజమకుటంలా నిలిచిన నటీమణి రాజసులోచన. ఆమె ప్రముఖ నటే కాదు, ప్రముఖ నర్తకి కూడా. ఎన్నో చిత్రాలలో ఆమె నర్తకి పాత్ర పోషించారు. ప్రముఖ నటులు, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కీర్తి శేషులు యన్ టి రామారావు గారితో పాటు అందరు ప్రముఖ హీరోలతో ఎన్నో చిత్రాలలో నటించారు.
ఇటీవల అభినందన సాంస్కృతిక సంస్ధ అందించిన యన్.టి.ఆర్ అవార్డు మరియు బంగారు పతకం అందుకోవడానికి చెన్నై నగరం నుండి మన నగరానికి విచ్చేసి తన సినీ రంగ అనుభవాలను, యన్.టి.ఆర్ అవార్డు తీసుకున్నందుకు ఆమె తన అనుభూతిని, ఙ్ఞాపకాలను అందరితో పంచుకున్నారు.
ప్ర. యన్.టి. రామారావుగారి అవార్డు మరియు బంగారు పతకాన్ని అందుకుంటున్నపుడు మీ స్పందన గురించి చెప్పండి.
జ. యన్.టి.ఆర్ అవార్డుని,బంగారు పతకాన్ని అందుకుఁటున్నందుకు చాలా సంతోషంగా వుంది. అంతే కాదు యన్.టి. రామారావుగారి ఆత్మకూడా సంతోషిస్తుంది. మరో జన్మ ఉన్నా లేకపోయినా ఆఆత్మ తాలూకు వైబ్రేషన్స్ తనకి ఇష్టమైన వారు ఎవరూ ఏమిటీ అని చూస్తుంటాయి.వాటి ద్వారా ఆత్మ సంతోషిస్తుంది.
ప్ర. రామారావుగారితో చాలా సినిమాలలో నటించారు కదా. కలకాలం గుర్తుండే అనుభూతులు, మరచిపోలేని అనుభవాలు ఏమైనా ఉన్నాయా?
జ. నేను రామారావుగారితో చాలా సినిమాల్లో నటించాను. ప్రతి సినిమా ఒక్కో అనుభవం. "సొంతవూరు" సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించాము. ఆసినిమాలో ఆయన కృష్ణుడు వేషం వేశారు. నేను రాధిక వేషం వేశాను. రామారావుగారు చాలా సినిమాల్లో కృష్ణుడిగా చేశారు.మనం చూసే కృష్ణుడు వేరు. ఇందులో వేసిన కృష్ణుడు వేరుగా ఉండేవారు. అలాగే పెంకి పెళ్ళాం సినిమాలో చాలా సరదాగా ఉండేవారు. ఆసినిమాలో నన్ను పెళ్లాడవే చెంచిత అనే డాన్స్ ఉంది.ఆ డాన్స్ చాలా విగరస్గా చేసేవారు. నేను చాలా భయపడేదాన్ని. ఆ సీన్ మర్చిపోలేను.
బి.యన్. రెడ్డిగారి డైరెక్షన్లో "రాజమకుటం" లో చేశాను. కత్తి పట్టుకు చేసే డాన్స్లో కత్తి విసిరే సీనం ఉంది. అలా విసరటంలో నేను ఒకవేళ తప్పు చేస్తానా అనే భావం ఉండేది. ఎందకో సెంటిమెంట్‌గా కూడా కత్తి విసరటం నాకు ఇష్టం ఉండేది కాదు. చివరికి నేను విసరలేదు అనుకోండి. ఆరోజుల్లో రామారావుగారైనా సరే, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్ అయినా సరే అందరూ ఒక కుటుంబంలా వుండేవాళ్ళం. "వాల్మీకి" , "టైగర్ రాముడు" ఇంకా చాలా సినిమాల్లో చేశాను.
ప్ర. మీరు మరచిపోలేని సినిమా ఏది?
జ. కారెక్టర్ పరంగా "బభ్రువాహన" సినిమా మరచిపోలేనిది. "మంచి మనసుకు మంచి రోజులు" సినిమా కూడా చాలా ఇష్టం. పాటలు చాలా బాగుంటాయి. అందులో నాకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది. "తాతా-మనవడు" లో నా వయసుకి మించిన పెద్ద పాత్ర వేశాను. అలాగే "సువర్ణ సుందరి" కూడా నాకు నచ్చింది.
ప్ర. సినీరంగంలో మీకాలంలో మీకు నచ్చిన ఇతర సినీ తారలు ఎవరు?
జ. సినీ ఇండస్ట్రీలో అంజలీదేవి అంటే చాలా ఇష్టం. అభిమానంతో,భక్తి భావంతో ఆమెని చూసుకుంటాను. గురువుగా ఉండేవారు. నాకు ఒక గైడ్ గా ఉండేవారు. నాకు పెద్దవాళ్ళు ఎవరూ లేరు. ఆమె నాకు మిత్రురాలు. ఆత్మీయురాలు. అన్ని విషయాలు ఆమెతో చర్చించేదాన్ని.
ప్ర. తెలుగు చిత్ర సీమకి తెలుగు హీరోయిన్లు కరవయ్యారు. ముంబాయి వంటి ఇతర నగరాల నుంచి వస్తున్నారు. మన తెలుగు రాష్ట్ర్రంలో డాన్సర్లు, హీరోయిన్లు లేరంటారా?
జ. మన తెలుగు వారు చాలామంది ఉన్నారు. వెతికి పట్టుకోవాలి. ప్రొడ్యూసర్స్ చేసే తప్పులు ఇవి. మన ఆంధ్ర రాష్ట్రంలో మంచి డాన్సర్లు, నటీ నటులు ఉన్నారు. కాని ఎక్కడ వున్నారని తెలిసి కనుక్కోవాలి. ఎవరు బాగా చేస్తున్నారు. ఎవరు బాగా యాక్ట్ చేస్తున్నారు అని వెతకాలి.
ఆరోజుల్లో నాటకాలు బాగా జరిగేవి. చాలామంది ఆర్టిస్ట్ లు మంచి ఎక్స్ ప్రెషన్స్ తో డైలాగ్ మాడ్యులేషన్స్ తో చెప్పేవాళ్ళు. ఆరోజుల్లో మా డబ్బింగం కూడా మేమే చెప్పేవాళ్ళం. నాకు కూడా మొదట్లో హిందీ వచ్చేది కాదు. కాగితం మీద తెలుగులో రాసుకుని చెప్పేదాన్ని. అలాగే మలయాళం కూడా. నేడు అంతా డబ్బింగ్ మయం. ఎలా యాక్ట్ చేస్తే ఏంటి? అనే భావంతో హీరోయిన్లు వస్తుంటారు. ఏదో చేసి పోతుంటారు.ఏదో ఒక పిక్చర్ లో బాగా చేసుండచ్చు. అది చూసి ఇక్కడి పిక్చర్స్ లో యాక్ట్ చేయిస్తుంటారు.
ప్ర. మీరు నర్తకి కదా ఎప్పటి నుంటి నృత్యం నేర్చుకున్నారు?
జ. నాకు పది సంవత్సరాల వయసునుంచే డాన్సు నేర్చుకున్నాను. మద్రాసులోనే నా నృత్య శిక్షణ జరిగింది.
1963లో మద్రాసులో పుష్పాంజలి నృత్య కళా కేంద్రం అనే సంస్ధని నెలకొల్పాను. హైదరాబాదులో నాగేశ్వరరావుగారి చేతులమీదుగా ప్రారంభించిన పుష్పాంజలి శాఖ కూడ వుండేది. కాని ఆంధ్రా యాజిటేషన్ సమయంలో మద్రాసు నుంచి రావటం ఇబ్బందిగా అనిపించి ఇక్కడ మూసేసాము. ఇప్పటికీ మద్రాసులో నడుస్తూనే ఉంది. ప్రస్తుతం బోర్టు తీసేసాను. కాని ఎవరైనా అడిగితే నేర్పిస్తుంటాను.
ప్ర. ఇప్పటి చిత్రాలలో నృత్యాలు ప్రజలని ఆకట్టుకునేలా వుండటం లేదు. అభినయంలో కాని, వస్త్ర ధారణలో కాని మార్పు వచ్చింది. ఆనాటి చిత్రాలలో మీరు నటించిన చిత్రాలు, నాట్యాలు నేటికీ అలరిస్తున్నాయి ఎందుకంటారు?
జ. నేడు నిర్మాతలు, దర్శకులు అలాగే కావాలంటున్నారు. నేడు డాన్స్ చేసేవారు కళాత్మకంగా కన్నా డబ్బుకోసమే చేస్తున్నారు. మా రోజుల్లో మేము కళకోసమే చేసేవాళ్ళం.. డబ్బుకోసం చేయలేదు.
ప్ర. నర్తకి గా మీ అనుభవాలు...?
జ. చిన్నతనం నుంచి డాన్స్ అంటే ఎంతో ఇష్టం నాకు. అలనాటి కూచిపూడి డాన్సర్లు, సినీ తారలు అయిన కమల,లలిత, పద్మిని డాన్స్ అంటే ఇష్టం. వారి స్ఫూర్తితో నేను కూచిపూడి, భరతనాట్యంలతో పాటు కధక్, కధాకళి కూడా నేర్చుకున్నాను. నా నాట్య గురువుల శిక్షణ నన్ను ఎన్నో సినిమాలలో నర్తికిగా ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే మా పుష్పాంజలి ద్వారా కూచిపూడి భరతనాట్యం నేర్చుకున్నారు. యల్.విజయలక్ష్మి, రాజ్యలక్ష్మి (శంకరాభరణం ఫేమ్,) లలిత (డిస్కో శాంతి చెల్లెలు) ఇలా ఎంతో మంది మా పుష్పాంజలిలో నృత్యం నేర్చుకున్నారు.
ఐదుగురు ముఖ్యమంత్రుల తో పని చేసిన అనుభవం నాకుంది. ఇది సంతోషించే విషయం నాకు. అన్నాదురై, జయలలిత, యం.జి.ఆర్, రామారావుగారు, మొదలైన వాళ్ళతో కలిసి డాన్స్ బాలేలు చేశాను. ఫిల్మోత్సవ్ లలో నా నృత్య ప్రదర్శనలు ఉండేవి.
ప్ర. "చిన్నారి పాపలు"లో మీరు డాన్స్ డైరెక్షన్ చేశారు. ఆతరువాత మరి ఏ పిక్చర్‌కి డైరెక్షన్ చేయలేదు ఎందుకని?
జ. సావిత్రి గారు డైరెక్ట్ చేసిన "చిన్నారి పాపలు" సినిమాలో అందరూ మహిళలే చేయాలి అని అన్నారు. నేను ఆసినిమాలో ఒక డాన్స్ డైరెక్ట చేశాను. ఆ సినిమాని సరదాగా చేశాము అందరం. నేను ఏమీ డబ్బు కూడా తీసుకోలేదు. అంతేకాదు నేను నటిని. డాన్స్ ఇంకొకరు చేయచ్చు కదా. అందుకని కూడా నేను మరే సినిమాలో డాన్స్ డైరెక్ట్ చేయలేదు. నటన నా ప్రొఫెషన్. యాక్టింగ్ ఒకటే తీసుకున్నాను.
ప్ర. ప్రతి టి.వి. ఛానెల్స్ కూడా డాన్స్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాయి. అందులోచిన్న చిన్న పిల్లలు కూడా డాన్స్ చేస్తుంటారు? ఇది హర్షించదగ్గ విషయమంటారా?
జ. డాన్స్‌ని సరిగా ఎవరూ గుర్తించకుండా దుర్వినియోగం చేస్తున్నారనిపిస్తుంది. డాన్స్ అనేది దైవికమైన కళ. ఆ కళ పోకూడదు. అది ఉండాలి. ప్రతి ముద్ర కూడా ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయి. అది ఎందుకు చేస్తున్నాము అనేది వుంటుంది. ఆ ముద్ర వల్ల బాడీలో వైబ్రేషన్స్ ఉంటాయి. అన్నీ చూసుకోవాలి. పేరెంట్స్ కూడా ఏదో పిక్చర్స్‌‌లో చూస్తున్నారు, మా పిల్లలు కూడా చేయాలి అని అనుకుంటున్నారు.ఈ శాస్త్రం, పద్ధతులు అవి అన్నీ నేర్చుకుంటే బాగుంటుంది.
ప్ర.సీనియర్ నటీమణులు అందరూ సినిమాల తర్వాత టి.వి.లలో నటిస్తున్నారు. మీరు ఎందుకు నటించడం లేదు?
జ. నటించకూడదని లేదు. ఒకసారి షూటింగ్‌లో హై బ్లడ్ ప్రెజర్ వల్ల పడిపోయాను. డాక్టర్లు, కుటుంబ సభ్యులు అందరూ ఇంతవరకూ నీకు అన్ని అవార్డులు వచ్చాయి. మంచి పేరు వచ్చింది. ఇంకా ఎందుకు నటించడం అని అనటంతో నేను నటించడం విరమించుకున్నాను.అంతేకాదు నాకు మూడు సార్లు హార్ట్ ఎటాక్ వచ్చింది. అనారోగ్య కారణాల వల్ల కూడా నేను మానుకున్నాను.
ప్ర. ప్రస్తుతం వస్తున్న హీరోయిన్లకు మీరిచ్చే సలహాల ఏమిటి?
జ. ఎవరైనా సరే ముందు భాష నేర్చుకోవాలి. అభినయం, నటన ఎక్స్ ప్రెషన్స్ సరిగ్గా చేయాలి.
ప్ర. సీనియర్ నటులంతా రాజకీయాల్లోకి వచ్చారు కదా! మీరు వచ్చే ఉద్దేశం ఉందా?
జ. సినిమాల్లో వున్న రాజకీయాలు చాలు. వేరే పాలిటిక్స్ ఎందుకు...
ప్ర. ప్రజా సేవ చేయచ్చుకదా...!
జ. ప్రజా సేవ ఆర్టిస్ట్గ్ గా కూడా చేయచ్చు. అందరూ పాలిటిక్స్ లోకి వస్తే ఎలా. రాజకీయ నాయకులకి కొన్ని లక్షణాలుంటాయి. వారు చేసిన దాన ధర్మాలు. పూజా పునస్కారాలు. మంచి పేరు. ప్రజాభిమానం, అలా ఎన్నో ఉండాలి. అందరూ రాజకీయవేత్తలు కాలేరు.
***
"సంపాదించినప్పుడే వచ్చిన దాంట్లోంచి కొంత దాచి పొదుపు చేయడం వల్ల చరమ జీవితంలోనూ అవసరాలకి ఉపయోగ పడుతుంది" అనే ప్రముఖ నర్తకి, నటీ రాజసులోచన మాటలు ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి.

ఇంకా

రాజ సులోచన జీవన సౌరభాలు.....

రాజసులోచన జీవిత విశేషాలు(క్విక్ )

రాజసులోచన జీవిత విశేషాలు

By కె, మణినాథ్


పుట్టిన తేది15 ఆగస్టు, 1935
తల్లి, తండ్రిదేవకమ్మ, భక్తవత్సలం
పుట్టిన వూరువిజయవాడ, కృష్ణాజిల్లా
పెరిగింది,విద్యాభ్యాసంచెన్నై
వివాహం1963
భర్తపేరుసి.యస్.రావు, ప్రముఖ సిని దర్శకులు. (ప్రముఖ దర్శకులు సి. పుల్లయ్య, ప్రముఖ సినీనటి శాంతకుమారిల కోడలు)
సంతానంఇద్దరు అమ్మాయిలు, (శ్రీగురుస్వామి,శ్రీదేవి; వాళ్ళూ నృత్యకారిణులే!) ఒక అబ్బాయి.
నివాసంచెన్నై
నటించిన సినిమాలుదాదాపు 300
నటించిన ఇతర భాషల సినిమాలుతమిళ్, కన్నడ, తమిళ్, మలయాళం
తెలుగులో హిట్ చిత్రాలలో కొన్నికన్నతల్లి, సొంతవూరు, పెంకి పెళ్ళాం,తోడి కోడళ్ళు (పాతది), పాండవ వనవాసం,సారంగధర, పెళ్ళినాటి ప్రమాణాలు,మాంగల్యబలం, రాజమకుటం, శాంతినివాసం, టైగర్ రాముడు, జయభేరి, వాల్మీకి, వెలుగునీడలు, తిరుపతమ్మకధ, బభ్రువాహన, తాతామనవడు, తోడికోడళ్ళు (కొత్తది)...ఇంకా ఎన్నో చిత్రాలు
హిందీలో నటించిన చిత్రాలుసితారోంసే ఆగే, చోరీ చోరీ, నయా ఆద్మీ మొ.వి
ఆనందించిన అంశంఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద పని చేయడం. అన్నాదురై, యం.జి.ఆర్, జయలలిత, యన్.టి.రామారావు మొదలైన ముఖ్యమంత్రుల హయాంలో "బాలే"లురూపొందించి, నృత్య ప్రదర్శనలు ఇవ్వడం.
నృత్య సంస్ధ పేరుపుష్పాంజలి నృత్య కళా కేంద్రం
నచ్చిన సినిమామంచి మనసుకు మంచి రోజులు
నచ్చిన కారెక్టరుబభ్రువాహన
నచ్చిన నటీమణిఅంజలీదేవి
విదేశీ పర్యటనలుఅమెరికా, రష్యా,జపాన్,శ్రీలంక,చైనా, సింగపూర్

రాజ సులోచన జీవన సౌరభాలు.....


By కె, మణినాథ్



1935లో విజయవాడలో జన్మించిన రాజసులోచన బాల్యం నుంచీ మద్రాసులోనే పెరిగారు. ఆచార వ్యవహారాల ఇంట పెరిగిన ఆమెకు సంగీతం, ఫిడేలు వంటి వాటిల్లో ప్రవేశం వున్నా, నృత్యమంటేనే ఎంతో మక్కువ! తన పదవ ఏటనుంచే డాన్స్ నేర్చుకోవడం మొదలు పెట్టారు. తాను నేర్చుకున్నది చుట్టుపక్కల ఆడపిల్లలకు నేర్పేవారు.ఎక్కడ అవకాశం లభించినా నాట్య ప్రదర్శన లిచ్చేవారు.
ప్రసిద్ధ కూచిపూడి నాట్యగురువులు వెంపటి పెద సత్యం, పసుమర్తి కృష్ణమూర్తి, చినసత్యం, జగన్నాధ శర్మ మొదలైన వారి శిక్షణలో రాజసులోచన నాట్యం ఆ సినిమాకే కలికితురాయిలా ఉండేది. భరత నాట్యం, కూచిపూడి, కధక్, కధాకేళి వంటి నాట్య కళలో ఆరితేరారు. దేశ విదేశాలలో పలు ప్రదర్శనలూ ఇచ్చారు. అమెరికా, చైనా, జపాన్, శ్రీలంక , రష్యా, సింగపూర్ వంటి దేశాలలో ప్రదర్శనలిచ్చారు.
రాజసులోచన ఇచ్చిన నాట్య ప్రదర్శనతోనే సినిమాలలో అవకాశం వచ్చింది. కన్నడ సినిమా 'గుణసాగరి'లో తొలి అడుగు వేసినా, తమిళం చిత్రం ’సత్యశోధనై’ మలి చిత్రం అయినా తెలుగులో 'కన్నతల్లి(1953)’ సినిమాతో తన నట జీవితం మొదలు పెట్టారు. అందులో చిన్న పాత్రలో కనిపించిన వీరు ’సొంతవూరు’ సినిమాతో కధానాయిక పాత్రలు వేయడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఆమె ఎన్నో చిత్రాలలో కధానాయికగా నటించి ఆ చిత్ర విజయాలకి కారణమయ్యారు. ఎన్నో చిత్రాలు వందరోజులు ఆడాయి. నిర్మాతలకి కాసుల వర్షమూ కురిపించాయి.ఆమె నటించిన చిత్రాలలో 'రాజమకుటం' లోని సడిసేయకోగాలి... సడిసేయబోకే .. పాట నేటికీ ప్రజాదరణ పొందుతోంది. జానపద ఇతి వృత్తంగల ఆ సినిమా ఆర్ధికంగా పెద్దగా ఆడకపోయినా ఆమె నటన, యన్ టి రామారావు గారి నటన, బియన్ రెడ్డి గారి డైరెక్షను ఆ చిత్రాన్ని సెల్యులాయిడ్ పై చిరంజీవిలా నిలిచేలా చేశాయి.
ప్రముఖ సినీ దర్శకులు సియస్.రావుతో 1963లో వివాహం. దాదాపు 300 చిత్రాలలో నటించిన ఆమె చివరగా నటించిన సినిమా తోటికోడళ్ళు (కొత్తది)ప్రస్తుతం చెన్నై నగరంలో ప్రశాంత జీవితం గడుపుతున్నారు.

ఇంకా

రాజసులోచన జీవిత విశేషాలు(క్విక్ లుక్)

యన్.టి.ఆర్ అవార్డు గ్రహీత రాజసులోచన గారితో ఒక ఇంటర్‌వ్యూ